నేడు దేశ వ్యాప్తంగా 103 అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవం..తెలంగాణలో ఆ మూడు స్పెషల్

నేడు దేశ వ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వేస్టేషన్లను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

By Knakam Karthik
Published on : 22 May 2025 7:17 AM IST

Telangana,  Amrit Bharat stations, Pm Modi, Central Government, Railway,

నేడు దేశ వ్యాప్తంగా 103 అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవం..తెలంగాణలో ఆ మూడు స్పెషల్

నేడు దేశ వ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వేస్టేషన్లను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. తెలంగాణలో ప్రస్తుతం రూ.42,219 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లోనూ రూ.5,337 కోట్లు తెలంగాణకు కేటాయించారు. ఇది 2014-15 నాటి తెలంగాణకు కేటాయించిన రైల్వే బడ్జెట్ తో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ.

రైల్వేలలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలలో ఒకటి రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 1 లక్ష కోట్ల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 1300 కు పైగా రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు, 2023 లో ప్రారంభించారు. రాబోయే 30 నుంచి 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలను తీర్చేలా ఆయా రైల్వేస్టేషన్లను సిద్ధం చేయనున్నారు.

ఇందులో తెలంగాణలోనూ 40 రైల్వేస్టేషన్లలో దాదాపు రూ.2,750 కోట్లతో పునరాభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగంగా సాగుతున్నాయి. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా సాగుతున్న ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్న 103 రైల్వేస్టేషన్లను ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ వర్చువల్ గా ప్రారంభించనున్నారు.

ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయి. ఇందులో బేగంపేట రైల్వేస్టేషన్ పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడవనుండటం విశేషం. పునరాభివృద్ధి పనులు జరుగుతున్న అన్ని రైల్వేస్టేషన్లలో ఆయా ప్రాంతాల్లోని సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ముఖద్వారం, స్టేషన్ ప్రధాన భవనాల నిర్మాణం సాగుతోంది. అంతేకాకుండా స్టేషన్ లోపల ప్రయాణికులకు అనువుగా ఫుట్‌పాత్‌లు, విశాలమైన ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్స్, బుకింగ్ ఆఫీస్, టాయిలెట్ల నిర్మాణం, సైనేజ్ బోర్డుల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Next Story