తెలుగు రాష్ట్రాల‌లో ఈ ఇద్ద‌రు ఎంపీ అభ్య‌ర్ధులు వెరీ రిచ్‌..!

తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేత‌ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏపీ టీడీపీ నేత‌ పెమ్మసాని చంద్రశేఖర్‌లు రూ.1,000 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉండి దేశంలోనే అత్యంత ధనవంతులైన ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఉన్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 April 2024 10:37 AM IST
తెలుగు రాష్ట్రాల‌లో ఈ ఇద్ద‌రు ఎంపీ అభ్య‌ర్ధులు వెరీ రిచ్‌..!

తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేత‌ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏపీ టీడీపీ నేత‌ పెమ్మసాని చంద్రశేఖర్‌లు రూ.1,000 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉండి దేశంలోనే అత్యంత ధనవంతులైన ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఉన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరపున విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తుండగా.. టీడీపీ గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. రానున్న ఎన్నికల కోసం విశ్వేశ్వర్‌రెడ్డి సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు.

విశ్వేశ్వర్ రెడ్డి

విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో రూ. 4,568 కోట్లకు పైగా విలువైన చర, స్థిరాస్తులతో స‌హా ఇత‌ర ఆస్తుల‌ను చూపారు. అపోలో హాస్పిటల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, PCR ఇన్వెస్ట్‌మెంట్స్, సిటాడెల్ రీసెర్చ్, సాఫ్రాన్ సొల్యూషన్స్ తో పాటు ఇతర వ్యాపారాలలో ఆయ‌న‌ ఆస్తులలో ఎక్కువ భాగం అతని జీవిత భాగస్వామి సంగీతా రెడ్డి పేరిట‌ ఉన్నాయి.

విశ్వేశ్వర్ రెడ్డి నికర ఆస్తుల విలువ దాదాపు రూ.1,240 కోట్లు కాగా, ఆయన కొడుకు ఆస్తుల విలువ రూ.108 కోట్లు, ఆయన భార్య ఆస్తుల విలువ రూ.3,208 కోట్లు అని పోల్ అఫిడవిట్‌లో తేలింది. వీరిద్దరి వజ్రాలు, బంగారం ఆస్తుల విలువ రూ.11 కోట్లు. ఆయ‌న‌కు చేవెళ్ల, రాజేంద్రనగర్, చిత్తూరులో వ్యవసాయ భూములు, అలాగే అపర్ణ అమృతం పుప్పాలగూడలో రెండు విల్లాలు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విశ్వేశ్వర్ రెడ్డికి సొంత కారు లేదు. విశ్వేశ్వర్ రెడ్డి మీద నాలుగు క్రిమినల్ కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.

పెమ్మసాని చంద్రశేఖర్‌

EC డేటా ప్రకారం.. 2022-23లో పెమ్మసాని ఆదాయం రూ. 3.68 లక్షలు కాగా ఆయ‌న‌ జీవిత భాగస్వామి కోనేరు శ్రీరత్న ఆదాయం రూ. 1.47 లక్షలుగా ఉంది.

పెమ్మసాని చరాస్తుల విలువ రూ. 2,316.54 కోట్లు, ఇందులో ఎఫ్‌డిఆర్‌లు, టర్మ్ డిపాజిట్లు, ఇతరాలు ఉన్నాయి. అతని జీవిత భాగస్వామి చరాస్తుల విలువ రూ. 2,289.35 కోట్లు. పెమ్మసాని స్థిరాస్తుల విలువ రూ.72 కోట్లు, ఆయన జీవిత భాగస్వామి ఆస్తుల విలువ రూ.34.82 కోట్లు. అతని స్థిరాస్తులు చాలా వరకు టెక్సాస్, హైదరాబాద్‌లో ఉన్నాయి.

పెమ్మసాని అమెరికాలోని జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్‌లో డిపాజిట్లు కలిగి ఉన్నారు. ఆయ‌న‌, ఆయ‌న‌ భార్య 519 కోట్ల రూపాయల అప్పులు కలిగి ఉన్నారు. పెమ్మసాని, ఆయ‌న‌ భార్య కోనేరు శ్రీరత్న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 101 కంపెనీలలో ఉమ్మడి వాటాలను కలిగి ఉన్నారు.

పెమ్మసానికి రూ.2.1 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్, రెండు బెంజ్ కార్లు, టెస్లా ఎక్స్ కూడా ఉన్నాయి.

పెమ్మసాని 2005లో USAలోని పెన్సిల్వేనియా గీసింజర్ మెడికల్ సెంటర్‌లో ఇంటర్నల్ మెడిసిన్‌లో తన MDని పూర్తి చేశారు. ఆయ‌న‌ 1999లో ఆంధ్రప్రదేశ్‌లోని Dr NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో తన MBBS పూర్తి చేశారు. ఆయ‌న‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు.

Next Story