Telangana: 3 రోజులపాటు వర్షాలు.. ఈ జిల్లాలకు ఐఎండీ అలర్ట్
వర్షాకాలంలో వేసవి తరహా ఎండలు కొడుతున్న వేళ.. తెలంగాణ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. శనివారం రాత్రి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
By అంజి Published on 3 Sep 2023 2:45 AM GMTTelangana: 3 రోజులపాటు వర్షాలు.. ఈ జిల్లాలకు ఐఎండీ అలర్ట్
వర్షాకాలంలో వేసవి తరహా ఎండలు కొడుతున్న వేళ.. తెలంగాణ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. శనివారం రాత్రి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉత్తర బంగాళాఖాతంలో నేడు ఆవర్తన ప్రభావం ఏర్పడనుంది. దీని ప్రభావంతో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే ఛాన్స్‌లు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని వల్ల తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. రాష్ట్రంలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వానలు కురుస్తాయని, గంటకు 30 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అప్రమత్తం చేసింది.
ఇప్పటికే విదర్భ నుండి కర్ణాటకకు ఒక ద్రోణి కొనసాగుతున్నట్టు ఐఎండీ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వివరించింది. మరోవైపు ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిన్న, మొన్న భారీ వర్షాలు కురిశాయి.
నిన్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో 5.5 సెం.మీ., నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెళ్లి 5.4 సెం.మీ., నారాయణపేట జిల్లా ధన్వాడ 4.8 సెం.మీ., నిర్మల్ జిల్లా భైంస మండలం వనాల్‌పహాడ్‌లో 4.3 సెం.మీ. వర్షం కురిసింది. రంగారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, జోగులాంబ గద్వాల, కరీంనగర్ జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కృష్ణానగర్, ఫిలింగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్, షేక్‌పేట్, మణికొండ, రాయదుర్గం, మెహదీపట్నం, టోలిచౌకి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌తోపాటు చాలా ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. చింతల్, సుచిత్రా, జీడిమెట్ల, బాలానగర్, కూకట్‌పల్లి సహా పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. ఉరుములతో కూడిన తుఫాను హెచ్చరిక కూడా జారీ చేయబడింది. హైదరాబాద్ నగరంలో మోస్తరు వర్షాలు, గాలులు కూడా వచ్చే అవకాశం ఉంది.