తెలంగాణలో మాస్క్ ధరించకపోతే రూ. 1,000 జరిమానా.!
If the mask is not worn in Telangana, Rs. 1,000 fine. ఒక వేళ మాస్కు ధరించకపోతే ఇవాళ్టి నుంచి పోలీసులు రూ.1000 జరిమానా విధిస్తారని తేల్చి చెప్పారు.
By అంజి Published on 2 Dec 2021 9:05 AM GMTదక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమ్రికాన్.. ఇప్పటికే 24 దేశాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. బుధవారం నాడు యూకే నుండి హైదరాబాద్‌కు వచ్చిన ఓ 35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మహిళకు ఎయిర్‌పోర్టులో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేశారు. అందులో ఆమె పాజిటివ్ వచ్చినట్లు నిర్దారణ అయ్యిందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్‌రావు తెలిపారు. ఒమ్రికాన్ వేరియంట్‌కు సంబంధించి యూకే దేశం ఇప్పటికే ప్రమాదకర దేశంగా వర్గీకరించబడింది.
ప్రయాణికురాలిని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్చారు. ఆమె నమూనాలను సేకరించి జెనెటిక్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. ఆమెకు ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని, ఆమె ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళ హైదరాబాద్ నుండి యూకే పర్యటనకు వెళ్లి వచ్చింది. ఆమె దగ్గరి బంధువులకు పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చినప్పటికీ వారి ఆరోగ్య పరిస్థితిని కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఒమ్రికాన్ వేరియంట్ కలవరం నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్‌రావు తెలిపారు. అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. ఒక వేళ మాస్కు ధరించకపోతే ఇవాళ్టి నుంచి పోలీసులు రూ.1000 జరిమానా విధిస్తారని తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు వ్యాక్సిన్ వేసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఒమ్రికాన్ వేరియంట్ కట్టడిపై సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. ప్రజలందరూ తప్పక కొవిడ్ నిబంధనలు పాటించాలి, ఒమ్రికాన్ నియంత్రణకు మన వంతు ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. ముప్పు ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ ఉందని, జాగ్రత్తలు పాటించకపోతే అసత్య ప్రచారాలే వాస్తవాలు అవుతాయని శ్రీనివాస్ రావు హెచ్చరించారు.