రైతులు కన్నీళ్లు పెడుతుంటే.. డైవర్షన్ పాలిటిక్సా?: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని కేటీఆర్ విమర్శించారు.
By అంజి Published on 1 Nov 2024 6:57 AM GMTరైతులు కన్నీళ్లు పెడుతుంటే.. డైవర్షన్ పాలిటిక్సా?: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని కేటీఆర్ విమర్శించారు. ''వానాకాలం వరికోతలు సాగుతున్నా రైతుబంధు వేయలేదు. రూ.15 వేల రైతు భరోసా ఊసే లేదు. కనీసం పండిన పంటను కొనుగోలు చేయడం లేదు. కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దైందన్నారు. రైతులు కన్నీళ్లు పెడుతుంటే ముఖ్యమంత్రి చిట్టినాయుడు మాత్రం రోత పుట్టించే కూతలతో డైవర్షన్ పాలిటిక్స్‌తో బిజీబిజీగా ఉన్నాడు'' అని రైతు వీడియోను కేటీఆర్ ట్వీట్ చేశారు.
''కాంగ్రెస్ దళారి ప్రభుత్వం రైతులను నిండా ముంచింది. వానాకాలం వరికోతలు సాగుతున్నయ్. కానీ నేటి వరకు రైతుబంధు వేయలేదు. రూ.15 వేల రైతు భరోసా ఊసే లేదు. కనీసం హార్వెస్ట్ చేసిన పంటను కొనుగోలు కూడా చేయడం లేదు. దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలకు చాలా చోట్ల కల్లాలలో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దైంది'' అని కేటీఆర్ అన్నారు.
''ఈ సీజన్లో 91.28 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామన్నారు. అక్టోబరు నెలలో 8.16 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, అక్టోబర్ 28 నాటికి వరకు 913 మంది రైతుల నుంచి కేవలం 7,629 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రైతన్న అంటే ఎంత నిర్ల్యక్షం చూడండి. దళారులతో కుమ్మక్కు అయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలేదు. నేటి వరకు పూర్తి స్థాయిలో మిల్లుల కేటాయింపు జరగనేలేదు. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపాలో తెలియక ప్రారంభించిన ఐకేపీ కేంద్రాల్లోను కొనుగోలు ప్రక్రియ నిలిచింది. రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చిట్టి నాయుడు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్‌తో బిజీబిజీగా ఉన్నారు'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.