'ఐ బొమ్మ' రవి దేశం విడిచి పారిపోయే ప్రమాదం
'ఐబొమ్మ' నిర్వాహకుడు రవికి నాంపల్లి కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది.
By - Medi Samrat |
'ఐబొమ్మ' నిర్వాహకుడు రవికి నాంపల్లి కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ కేసులో అరెస్ట్ అయిన అతడిని ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అతడి నుండి మరిన్ని వివరాలు రాబట్టేందుకు వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఐదు రోజుల కస్టడీకి అనుమతినిచ్చారు. దీంతో పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. రవి ఏడేళ్లుగా ఐ బొమ్మతో పాటు బప్పం, ఐ విన్, ఐ రాధ టీవీ వంటి పేర్లతో పలు వెబ్‌సైట్లను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రవి నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో పోలీసులు జరిపిన సోదాల్లో రూ.3 కోట్ల నగదు, వందల సంఖ్యలో హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న రవి, ఎవరితో మాట్లాడకుండా ముభావంగా ఉంటున్నాడు. తనను కలిసేందుకు వచ్చిన న్యాయవాదులతో మాట్లాడేందుకు కూడా నిరాకరించాడు. విదేశీ పౌరసత్వం ఉన్న రవి దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉండటంతోనే అరెస్ట్ చేశామని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.