బంజారాహిల్స్‌లోని TOS పబ్‌పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. 42 మంది మహిళలతో సహా 140 మందిని అదుపులోకి తీసుకున్నారు. అశ్లీల నృత్య ప్రదర్శనలతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించారు. పబ్ నిర్వాహకులు, క్యాషియర్, డీజే ఆపరేటర్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి విచారణ కోసం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు పబ్‌పై కేసు నమోదు చేశారు. దాడి చేసిన సమయంలో పబ్‌లో మెుత్తం 100 మందికి పైగా యువకులు ఉన్నట్లు సమాచారం. కస్టమర్లకు మహిళలతో మద్యం ఇప్పించడమే కాకుండా.. మహిళలు తాగే వాటికి కూడా బిల్లును కస్టమర్లతో కట్టిస్తున్నారని పోలీసులు తెలిపారు.
మగ కస్టమర్లను ప్రలోభపెట్టి లాభాలు ఆర్జించేందుకు పబ్ వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలను నియమించారని, వారు కస్టమర్లతో అసభ్యకరంగా ప్రవర్తించేవారని పోలీసు అధికారులు తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) వెంకట రమణ, నైట్ డ్యూటీ ఆఫీసర్ సంజీవరెడ్డి నగర్ సంఘటనా స్థలానికి చేరుకుని పబ్ ను పరిశీలించారు. మరిన్ని వివరాలను తెలియజేస్తామని పోలీసులు చెప్పారు. తదుపరి విచారణ జరుగుతోంది.