Telangana: మరో ఐదు రోజులు వర్షాలు.. ముఖ్యంగా ఆ జిల్లాలకు అలర్ట్
తెలంగాణ వ్యాప్తంగా గడిచిన 3 రోజుల నుండి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 6 Sept 2023 8:15 AM ISTTelangana: మరో ఐదు రోజులు వర్షాలు.. ముఖ్యంగా ఆ జిల్లాలకు అలర్ట్
తెలంగాణ వ్యాప్తంగా గడిచిన 3 రోజుల నుండి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం నాడు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
వాయవ్య బంగాళాఖాతం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి వైపు వాలింది. ఈ అల్పపీడనం 24 గంటల్లో పశ్చిమ దిశగా ఛత్తీస్‌గడ్ మీదుగా కదిలే అవకాశం ఉందన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని ప్రకటించింది.
అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తుందని, దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతోపాటు తెలంగాణలో 8వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రేపటి వరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు పడతాయని, కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు పడతాయని హెచ్చరించింది.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ స్పష్టంచేసింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మహబూబ్‌నగర్, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, హైదారాబాద్, మంచిర్యాల, భదాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, హనుమకొండ, జనగామ, జోగులాంబ గద్వాల జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.