వర్సిటీ భూమిని అన్యాక్రాంతం చేయొద్దు, TGIIC ప్రకటనను ఖండించిన HCU రిజిస్ట్రార్
హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనన్న టీజీఐఐసీ ప్రకటనను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఖండించారు.
By Knakam Karthik
వర్సిటీ భూమిని అన్యాక్రాంతం చేయొద్దు, TGIIC ప్రకటనను ఖండించిన HCU రిజిస్ట్రార్
హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనన్న టీజీఐఐసీ ప్రకటనను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 2024 జులైలో అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని, ఇప్పటి వరకు భూమి ఎలా ఉందన్నదానిపై ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని అన్నారు. హద్దులకు అంగీకరించినట్లు టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు భూమి సరిహద్దులు గుర్తించలేదు. దీనిపై HCUకి సమాచారం ఇవ్వలేదు. ఆ భూమిని యూనివర్సిటీకే ఇవ్వాలని చాలా కాలంగా కోరుతున్నాం. భూమి కేటాయించడంతోపాటు పర్యావరణం, జీవ వైవిద్యాన్ని కాపాడాలని మరోసారి కూడా ప్రభుత్వాన్ని కోరతాం. యూనివర్సిటీకి కేటాయించబడిన భూమిని బదిలీ చేయాలి అంటే, విశ్వ విద్యాలయం కార్యనిర్వాహక మండలి అధికారిక సమ్మతితో జరుగుతుంది" అని HCU రిజిస్ట్రార్ పేర్కొన్నారు.
టీజీఐఐసీ ప్రకటనలో ఏముంది?
కాగా కంచ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములను రక్షించాలని విద్యార్థులు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీజీఐఐసీ కీలక ప్రకటన చేస్తూ.. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని పేర్కొంది. ఈ భూమి యజమాని తానేనని న్యాయస్థానం ద్వారా ప్రభుత్వం నిరూపించుకుంది. ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకుంది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువులు లేవు. సర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీది కాదని తేలింది. కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ప్రణాళిక అక్కడ ఉన్న రాళ్ల రూపాలను దెబ్బతీయదు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రణాళికలో స్థానిక సుస్థిరాభివృద్ధి, పర్యావరణ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రాజెక్టును వ్యతిరేకించే కొందరు రాజకీయ నాయకులు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. 400ఎకరాల భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉంది. అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. 400 ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లోనూ ప్రభుత్వ భూమిగానే ఉంది. దీనిలో బఫెల్లో లేక్, పీకాక్ లేక్ లేవు. ప్రపంచస్థాయి ఐటీ మౌలిక వసతులు, అనుసంధానత పెంపు, తగినంత పట్టణ స్థలాల లభ్యత అనే ప్రభుత్వ ప్రాధాన్యానికి ప్రస్తుత ప్రాజెక్టు కట్టుబడి ఉంది” అని టీజీఐఐసీ పేర్కొంది.