అక్టోబరు రాకతో హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడుతుందని అంచనా వేసే వారు మరికొంత కాలం వేచి ఉండాల్సిందే. ఈ నెలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. దీంతో వాతావరణం చల్లబడాలంటే నవంబర్ వరకూ ఆగాల్సిందేనంటున్నారు. IMD హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేసింది.
గత కొద్దిరోజులుగా నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతూ జనాలను అసౌకర్యానికి గురిచేస్తున్నాయి. అక్టోబర్‌లో హైదరాబాద్‌లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 31.4 డిగ్రీల సెల్సియస్.. సగటు కనిష్ట ఉష్ణోగ్రత 20.9 డిగ్రీల సెల్సియస్. ఎల్ నినో పరిస్థితులు ప్రస్తుతం భూమధ్యరేఖ పసిఫిక్ ప్రాంతంలో కొనసాగుతున్నాయి. రాబోయే సీజన్‌లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని భావిస్తున్నారు. దీని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్‌లో వర్షపాతం తగ్గే అవకాశం ఉంది.