తెలంగాణలో అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు రోజులు సెలవులు

భారీ వర్ష సూచన నేపథ్యంలో హన్మకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో స్కూళ్లకు ఇవాళ, రేప సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

By అంజి
Published on : 13 Aug 2025 6:43 AM IST

Holidays, schools, districts, Telangana, heavy rains

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు రోజులు సెలవులు

భారీ వర్ష సూచన నేపథ్యంలో హన్మకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో స్కూళ్లకు ఇవాళ, రేపు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ జిల్లాల్లో 15న స్వాతంత్ర్య దినోత్సవం, 16న కృష్ణాష్టమి, 17న సండేతో కలిపి 5 రోజులు వరుస సెలవులు రానున్నాయి. అటు జీహెచ్‌ఎంసీ ఏరియాలో భారీ వర్షం పడే ఆస్కారం ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఇళ్లకు చేరేందుకు అవస్థలు పడకుండా స్కూళ్లను ఉదయం ఒకపూటే నడపాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

నేటి నుంచి మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరక్కుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

రానున్న 72 గంటల్లో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశారు. రానున్న పరిస్థితులను ఎదుర్కొనడానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ''రాబోయే మూడు రోజులు కీలకంగా మారినందున అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులను రద్దు చేయాలి. 24 గంటలు అందుబాటులో ఉండాలి. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరకుండా, పశు సంపదకు నష్టం జరక్కుండా చర్యలు తీసుకోవాలి.

24 గంటల్లో 2 సెం.మీ వర్షాన్ని తట్టుకునే విధంగా పట్టణాలు నిర్మితమై ఉన్నాయి. అలాంటిది క్లౌడ్ బరస్ట్ సమయాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అందరూ సన్నద్ధంగా ఉండాలి. గతంలో 2 గంటల్లో 42 సెం.మీ వర్షం పడటంతో నష్టం జరిగింది. విపత్తు నివారణ నిధులను వినియోగించుకోవాలి. నిధులకు కొరత లేదు. గ్రేటర్ హైదరాబాద్, గ్రామీణ ప్రాంతాల కోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేయాలి. సమాచారం ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూంకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలి. Hyderabad తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలి. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు సివిల్ పోలీసుల సేవలను వినియోగించుకోవాలి. పాఠశాలలు, కాలేజీలు నడపాలా, సెలవు ప్రకటించాలా అన్నది స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి.

హైదరాబాద్, రంగారెడ్డి లాంటి ప్రాంతాల్లో ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం నిర్వహించుకునేలా ఆయా సంస్థలతో ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ గారు సమన్వయం చేయాలి. వీలైనంత వరకు ప్రజలను రోడ్లపైకి రాకుండా అప్రమత్తం చేయాలి. హైడ్రా తరఫున ఎఫ్ఎం రేడియోల ద్వారా, టీవీల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. ప్రజలను ఆందోళనకు గురిచేసే సమాచారం ఇచ్చే సంస్థలకు వెనువెంటనే వాస్తవాలను వెల్లడించాలి. నగరంలో శిథిలావస్థలో ఉన్న భవనాలున్నాయి. జోనల్ కమిషనర్లను అప్రమత్తమై అలాంటి చోట ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.

భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించినప్పుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్స్ ఉండేలా చూసుకోవాలి. NDRF సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. హైడ్రా 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలి. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ విభాగంలో 2 వేల మందికి శిక్షణ ఇచ్చాం. సహాయక చర్యల కోసం ఎక్కడ అవసరమైతే వారిని అక్కడికి తరలించాలి.

విద్యుత్ అంతరాయం ఏర్పడితే తక్షణం పునరుద్దరణ పనులు చేపట్టాలి. మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్స్, అవసరమైతే జనరేటర్స్‌ను సమకూర్చాలి. విద్యుత్‌కు సంబంధించి అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్స్‌ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా, అలాగే పట్టణాల్లో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అత్యవసర సమయాల్లో అవసరమైన మెడిసిన్స్, సౌకర్యాలను అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి.

ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందో ఆ ప్రాంతాల్లో సమన్వయం కోసం కలెక్టర్లు అదనంగా అధికారులను నియమించుకోవాలి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ముసీ పరివాహక ప్రాంతంతో పాటు ప్రమాద స్థాయికి నీరు చేరుకునే ప్రాంతాలకు ప్రజలను వెళ్లనీయకుండా పోలీసులు నియంత్రించాలి. ప్రాజెక్టులు, చెరువులు, కుంట‌ల్లోకి ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లోపై నీటి పారుదల శాఖ అధికారులు పూర్తి అవ‌గాహ‌న‌తో ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు నీటి విడుద‌ల‌పై పూర్తి స‌మాచారం ఇవ్వాలి. చెరువులు, కుంట‌లు క‌ట్ట‌లు తెగే ప్ర‌మాదం ఉన్నందున ముంద‌స్తుగా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. మా శాఖకు సంబంధం లేదని ఏ విభాగం చెప్పడానికి వీలులేదు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ప్రత్యేకంగా ఒక గ్రూప్ ను క్రియేట్ చేసుకుని సమన్వయం చేసుకోవాలి. అవసరమైతే కొందరు సీనియర్ ఆఫీసర్లను డిప్యూట్ చేసుకోవాలి'' అని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

Next Story