రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం ఈరోజే న‌మోదైంది..!

Highest electricity consumption in the history of Telangana state. తెలంగాణ చరిత్రలోనే అత్యధికంగా 15,062 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మంగళవారం ఉదయం నమోదైంది.

By Medi Samrat  Published on  14 March 2023 10:00 AM GMT
రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం ఈరోజే న‌మోదైంది..!

తెలంగాణ చరిత్రలోనే అత్యధికంగా 15,062 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మంగళవారం ఉదయం నమోదైంది. గతేడాది ఇదే రోజున 12,727 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ నమోదైంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారిగా రికార్డ్ స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదు అయింది. మార్చిలో అనుకున్న విధంగానే 15,000 మెగావాట్ల విద్యుత్ వినియోగం దాటింది. ఇవాళ ఉదయం 15,254 మెగా వాట్ల విద్యుత్ వినియోగం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక వినియోగం అని టీఎస్‌ ట్రాస్కో అండ్‌ జెన్‌కో చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రభాకర్ రావు వెల్లడించారు. మొత్తం విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడుది మొదటి స్థానం కాగా తెలంగాణ రెండో స్థానంలో ఉందని చెప్పారు.

ప్రభాకర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం గరిష్ట డిమాండ్‌ 14,138 మెగావాట్లకు చేరుకోగా, మంగళవారం నాటికి 15,062 మెగావాట్లకు చేరింది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడం, పారిశ్రామిక అవసరాలు పెరగడంతో గత కొన్నేళ్లుగా విద్యుత్ వినియోగం పెరుగుతోందని చెప్పారు. గత మార్చిలో అత్యధిక విద్యుత్ వినియోగం 14,160 మెగావాట్లు కాగా, ఈసారి గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,062 మెగావాట్లకు చేరుకుందని, ఈ వేసవిలో 16,000 మెగావాట్లను దాటే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మార్చి నెలలో గరిష్ట డిమాండ్ 15,000 మెగావాట్లకు చేరుకుంటుందని ఇప్పటికే ఊహించామని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు.


Next Story