Bandi Sanjay Arrest : బొమ్మ‌ల రామారం పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌ ఉద్రిక్త‌త‌.. అదుపులో బీజేపీ నేత‌లు

బండి సంజ‌య్‌ను అరెస్టు చేసి బొమ్మ‌ల రామారంపోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించిన నేప‌థ్యంలో అక్క‌డ ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2023 10:53 AM IST
BJP, Bandi Sanjay Arrest

బొమ్మ‌ల రామారం పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌ ఉద్రిక్త‌త‌

తెలంగాణ భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ను పోలీసులు అరెస్ట్ చేయ‌డంపై ఆ పార్టీ నేత‌లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కార‌ణం చెప్ప‌కుండానే త‌మ నాయ‌కుడిని ఎలా అరెస్ట్ చేశారంటూ పార్టీ కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. బండి సంజ‌య్‌ను క‌రీంన‌గ‌ర్‌లో అరెస్టు చేసి భువ‌న‌గిరి జిల్లా బొమ్మ‌ల రామారం పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించిన నేప‌థ్యంలో అక్క‌డ ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పోలీస్ స్టేషన్‌ దగ్గర బీజేపీ శ్రేణులు ఆందోళ‌న‌కు దిగాయి. పోలీస్ స్టేష‌న్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో అక్క‌డ తోపులాట జ‌రిగింది. ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లే అన్ని మార్గాల‌ను బారికేడ్ల‌తో మూసివేశారు. బీజేపీ కార్యకర్తల నినాదాలతో బొమ్మల రామారం పోలీస్టేషన్‌ దద్దరిల్లింది.

బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. బండి సంజ‌య్‌ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ, ఏ కార‌ణం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తార‌ని ప్ర‌శ్నించారు. సంజ‌య్‌ను ప‌రామ‌ర్శించేందుకు వ‌స్తే త‌న‌ను అడ్డుకోవ‌డం ఏమిట‌ని మండిప‌డ్డారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే, పోలీసుల‌కు మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. అనంత‌రం ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బండి సంజ‌య్ అరెస్ట్‌పై మండిప‌డుతున్న బీజేపీ నేత‌లు

* సంజ‌య్ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. కార‌ణం లేకుండా అరెస్ట్ చేయ‌డం అప్ర‌జాస్వామికం.తెలంగాణ‌లో అరాచ‌క పాల‌న న‌డుస్తోంది - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

* బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లింది. ప్ర‌జ‌లు త్వ‌ర‌లోనే బీఆర్ఎస్‌ను బొంద‌పెడుతారు. అకార‌ణంగా సంజ‌య్‌ను అరెస్ట్ చేయ‌డం సిగ్గుమాలిన చ‌ర్య‌. బండి సంజ‌య్‌ను వెంట‌నే విడుద‌ల చేయాలి- డికే అరుణ‌

* కార‌ణం చెప్ప‌కుండా బండి సంజ‌య్ అరెస్ట్ చేయ‌డం దారునం. కేసీఆర్ చెప్పిన‌ట్లు వింటూ పోలీసులు వెన్న‌ముక లేకుండా వ్య‌వ‌హరిస్తున్నారు. బండి సంజ‌య్‌ను వెంట‌నే విడుద‌ల చేయాలి- ఈటల రాజేంద‌ర్‌

* బండి సంజ‌య్ అరెస్ట్‌ను ఖండిస్తున్నా. ఎన్నిసార్లు జైలుకు పంపినా బండి భయపడరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్ట్‌లు చేస్తారా? పిల్లల జీవితాలను ప్రభుత్వం నాశనం చేస్తోంది. గూండాల రాజ్యాన్ని ప్రజలు గమనించాలి. ఆయ‌న్ను జైలులో పెడితే ప్ర‌భుత్వ త‌ప్పులు బ‌య‌టికి రావు అనిఅనుకుంటున్నారా..? అని ప్ర‌శ్నించారు - బీజేపీ స‌స్పెండ్ ఎమ్మెల్యే రాజాసింగ్

Next Story