Bandi Sanjay : అర్థ‌రాత్రి హైడ్రామా.. బండి సంజ‌య్ అరెస్ట్

క‌రీంన‌గ‌ర్‌లో అర్థ‌రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2023 7:38 AM IST
BJP, Bandi Sanjay Arrest

బండి సంజ‌య్ అరెస్ట్

క‌రీంన‌గ‌ర్‌లో అర్థ‌రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయ‌న్ను ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా బొమ్మ‌ల‌రామారం పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అయితే.. ఆయ‌న్ను ఎందుకు అరెస్ట్ చేశారు అన్న వివ‌రాలు ఇంకా తెలియ‌రాలేదు.

బండి సంజ‌య్ అత్త‌మ్మ ఇటీవ‌ల చ‌నిపోగా 9 రోజుల కార్య‌క్ర‌మాన్ని బుధ‌వారం నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో జ్యోతిన‌గ‌ర్‌లోని వారి ఇంటికి బండి సంజ‌య్ వెళ్లారు. బండి సంజయ్ వచ్చారన్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్క‌డ‌కు వెళ్లి.. మిమ్మ‌ల్ని అరెస్టు చేస్తున్నాం, స‌హ‌క‌రించాల‌ని సంజయ్‌ను కోరారు. అయితే.. త‌న అరెస్టుకు కార‌ణం చూపించాల‌ని, త‌న‌కు వారెంటు చూపాలంటూ పోలీసుల‌తో సంజ‌య్ వాగ్వాదానికి దిగారు.

అదే స‌మ‌యంలో బండి సంజ‌య్‌ను అరెస్ట్ చేస్తున్నారన్న విష‌యం తెలుసుకున్న బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అక్క‌డ‌కు చేరుకున్నారు. పోలీసుల ప్ర‌య‌త్నాన్ని కార్య‌క‌ర్త‌లు ప్ర‌తిఘ‌టించారు. ఈ క్ర‌మంలో పోలీసులు, కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య తోపులాట జ‌రిగింది. అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. పోలీసులు బ‌ల‌వంతంగా సంజ‌య్‌ను వాహ‌నంలోకి ఎక్కించి అక్క‌డి నుంచి త‌ర‌లించారు.

బండి సంజ‌య్ అరెస్టుని నిర‌సిస్తూ బీజేపీ శ్రేణులు ముఖ్య‌మంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ‌ను ద‌గ్థం చేశాయి. బండి సంజ‌య్‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తూ రోడ్ల‌పై బైఠాయించారు.

Next Story