హుజురాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల ఘర్షణ
High Tension At Huzurabad. హుజురాబాద్ ఉప ఎన్నిక సమీపిస్తోన్న సమయంలో పట్టణ నడిబొడ్డున సంచలన ఘటన చోటుచేసుకుంది.
By Medi Samrat
హుజురాబాద్ ఉప ఎన్నిక సమీపిస్తోన్న సమయంలో పట్టణ నడిబొడ్డున సంచలన ఘటన చోటుచేసుకుంది. అంబేద్కర్ విగ్రహం ఎదుట టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకొని రచ్చ చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో బుధవారం రాత్రి నుండి ఈటల రాజేందర్ బావమరిది మధుసూధన్ రెడ్డి వాట్సప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో మధుసూధన్ రెడ్డి ఎస్సీలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈటల భార్య జమునారెడ్డి, ఆమె సోదరుడు మధుసూధన్ రెడ్డిలు వందలమంది కార్యకర్తలతో కలిసి హుజురాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న క్రమంలో కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తల గ్రూపు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఈ నేఫథ్యంలోనే సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను బీజేపీ దళిత నేతలు దహనం చేసి నిరసన తెలిపారు. ఇందుకు పోటీగా టీఆర్ఎస్ దళిత నేతలు ఈటల రాజేందర్ కుటుంబసభ్యుల దిష్టి బొమ్మను దహనం చేశారు.
అనంతరం పరిస్థితి అదుపుతప్పి ఒకరినొకరు నెట్టుకోవడం నుంచి చెప్పులు విసురుకోవడం వరకూ వెళ్లింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకొని.. ఇరు పార్టీల నాయకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా రెండు పార్టీల నేతలు జమ్మికుంట, వరంగల్ రహదారిపై బైఠాయించారు. ఇరు పార్టీల నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.