తెలంగాణలో భారీ వర్షాలు.. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్
Heavy rains lash Telangana.. Red alert for 9 districts. తెలంగాణలో ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోని కొన్ని చోట్ల, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు
By అంజి Published on 9 July 2022 12:35 PM ISTతెలంగాణలో ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోని కొన్ని చోట్ల, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపోటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షంతో.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్‌లోని నవీపేటలో 206 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో చార్మినార్‌లో అత్యధికంగా 51.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
"భారీ వర్ష హెచ్చరిక. రాబోయే మూడు గంటల్లో ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇది కొన్ని ప్రాంతాల్లో వరదలకు దారి తీస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండండి." అంటూ ఇండిపెండెంట్ వాతావరణ పరిశీలకుడు టి బాలాజీ ట్వీట్ చేశారు. అయితే ఇవాళ హైదరాబాద్‌లో అడపాదడపా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. నగరంలో చల్లటి వాతావరణాన్ని అంచనా వేస్తూ, వరదలు వచ్చే అవకాశం తక్కువగా ఉందని చెప్పారు.
9 జిల్లాల్లో రెడ్ అలర్ట్
కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హాన్మకొండ సహా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో జూలై 9న ఐఎండీ హైదరాబాద్ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. హైదరాబాద్‌లో శనివారం వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో శనివారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.