ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు
ఒడిశా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముందని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంస్థ తెలిపింది. వర్షాలు, వరదల ప్రభావం ఉంటే రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూం(1070, 1800 4250101, 0863 237718)ను సంప్రదించాలని సూచించింది.
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
తెలంగాణలో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరటం వల్ల అక్కడి ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. భారీ వర్షాలకు నదులు, వాగుల్లో ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. నేడు, రేపూ అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. మరో 3 రోజుల్లో బంగాళాఖాతంలో మళ్లీ ఉపరితల ఆవర్తనం లేదా అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని, అదే జరిగితే భారీ వర్షాలు తరువాత కూడా కొనసాగనున్నాయి.