తెలుగు రాష్ట్రాలు.. కుండపోత వర్షాలు..!

Heavy Rains In Telugu States. తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇంకొద్ది రోజులు కూడా వర్షాలు

By Medi Samrat  Published on  22 July 2021 6:11 AM GMT
తెలుగు రాష్ట్రాలు.. కుండపోత వర్షాలు..!

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇంకొద్ది రోజులు కూడా వర్షాలు కురుస్తూనే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు కూడా విస్తారంగా వానలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాలో నేడు చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి రెండు చోట్ల మాత్రం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. అలాగే, కోస్తా తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మరోపక్క, బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రేపు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య అల్పపీడన ద్రోణి బలహీనపడడం.. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుందని చెప్పింది. వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో రాగల మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ విభాగం.


Next Story