తెలంగాణలో అతి భారీ వర్షాలు.. హై అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌, వరంగల్‌తో పాటూ ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

By అంజి  Published on  27 July 2023 7:33 AM IST
heavy rains, Telangana,  high alert, Warangal

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. హై అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌, వరంగల్‌తో పాటూ ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. ఇక వరంగల్‌, హైదరాబాద్‌ నగరాల్లో వరద పొటెత్తుతుండటంతో పలు కాలనీలు నీట మునిగాయి.. కొన్ని ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరింది. భద్రాచలం దగ్గర గోదావరి నద్రి ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. నది నీటి మట్టం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ క్రమంలోనే అత్యంత అప్రమత్తతతో ఉండాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్.పి లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే గోదావరి బేసిన్ లో పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, కాలువలు పూర్తి స్థాయి నీటి మట్టంతో ప్రవహిస్తున్నాయి. రెండు రోజుల్లో కురిసే భారీ వర్షాల వల్ల అవి మరింత ప్రమాద స్థాయిలో ప్రవహించే అవకాశముంది. నిండిన ప్రతీ చెరువు వద్ద, ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న కాజ్- వే ల వద్ద ప్రత్యేక అధికారులు, పోలీస్ అధికారులను నియమించి తగు జాగ్రత్త చర్యలను చేపట్టాలన్నారు.

లోతట్టు ప్రాంతాలు, ముంపుకు గురయ్యే ప్రాంతాలలో అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, గుర్తించిన పునరావాస కేంద్రాలలో అవసరమైన వస్తు సామాగ్రి ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాలకు దెబ్బతినే రాష్ట్ర, నేషనల్ హైవే రోడ్లను వెంటనే మరమ్మతులు జరపాలని ఆదేశించారు. జలపాతాలు, ఇతర పర్యాటక ప్రాంతాలకు ప్రజలు రాకుండా నివారించాలని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ దళాలను సిద్ధంగా ఉంచామని, అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలన్నారు. భారీవర్షాల నేపథ్యంలో చేపట్టిన జాగ్రత్త చర్యలపై ప్రజలను చైతన్యవంతం చేసేలా స్థానిక కేబుల్ టీవీలు, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తెలపాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) హైదరాబాద్‌లో గురువారం 115.60 మి.మీ నుండి 204.40 మి.మీ వరకు అతి భారీ వర్షపాతం నమోదయ్యే వాతావరణ సూచన హెచ్చరికను జారీ చేసింది , శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే హనుమకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇంతకంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని రిజర్వాయర్లు, వాగులు నిండడంతో పాటు కొన్ని నీటి వనరులు పొంగిపొర్లడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉప్పల్‌లోని నల్లచెరువు సరస్సు నుంచి భారీగా నీరు ప్రవహించడంతో బుధవారం తెల్లవారుజామున ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. ఉప్పల్‌లోని నగరం లోపలి రింగ్‌రోడ్డు వరదల కారణంగా ప్రయాణికులకు అసౌకర్యం కలిగింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Next Story