నేడు ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ వర్ష సూచన జారీ చేసింది. వచ్చే మూడ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.

By అంజి  Published on  20 Aug 2023 1:45 AM GMT
Heavy Rains, Telangana, IMD, Hyderabad

నేడు ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ కేంద్రం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుసే అవకాశం ఉందని తెలిపింది. నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక నిన్న రాష్ట్రంలో నారాయణపేట, నాగర్‌ కర్నూలు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

శనివారం నాడు నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌లో అత్యధికంగా 102.9 మిల్లీమీటర్లు, ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండలో 56.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఆదిలాబాద్‌ జిల్లాలో రోజంతా వర్షం కురవడంతో లోతట్టుప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలుచోట్ల జనజీవనం స్తంభించింది, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. జగిత్యాల జిల్లాలోనూ భారీవర్షాలు కురిశాయి. కోరుట్ల అంబేడ్కర్‌నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రహరీ కూలిపోయింది. విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టైంది. పలు కాలనీల్లోకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. హైదరాబాద్‌ నగరంలోనూ పలుచోట్ల వర్షం పడింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో 3 రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. వచ్చే 3 రోజుల్లో గుంటూరు, బాపట్ల, పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Next Story