హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం.. నేడు ఆ 11 జిల్లాల్లో అతి భారీ వర్షాలు
హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
By అంజి
హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం.. నేడు ఆ 11 జిల్లాల్లో అతి భారీ వర్షాలు
హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, ప్రగతినగర్, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, నిజాంపేట్, ఆల్విన్ కాలనీ, ఖైరతాబాద్, అమీర్‌పేట, మలక్‌పేట్, సైదాబాద్, సోమాజీగూడ, నాంపల్లి, పాతబస్తీ, ఎల్బీనగర్, సాగర్‌రింగ్ రోడ్, బేగంపేట, అడ్డగుట్ట, మారేడుపల్లి, హస్తినాపురం, సికింద్రాబాద్, ప్యాట్నీ, పారడైజ్, చిలకలగూడ, అల్వాల్, బొల్లారం, బోయిన్‌పల్లి, తిరుమలగిరిలో వర్షం జోరుగా కురుస్తోంది. పలు చోట్ల సోమవారం రాత్రి నుంచి పడుతూనే ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నగర శివారు ప్రాంతాలలో కూడా భారీ వర్షం కురుస్తోంది. గత రెండు గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
రాజేంద్రనగర్, అత్తాపూర్, కాటేదాన్, నార్సింగీ, మణికొండ, గండిపేట, బండ్లగూడలో వర్షం దంచికొడుతోంది. రోడ్లు, పలు కాలనీలు జలమయమయ్యాయి. పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఉప్పర్‌పల్లి 191 పిల్లర్ దగ్గర భారీగా వరద నీరు చేరకుంది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శివరాంపల్లి 296 పిల్లర్ దగ్గర రహదారి చెరువును తలపిస్తోంది. రోడ్డుపై వరద నిలిచిపోయింది. రాజేంద్రనగర్, శివరాంపల్లి లో అధిక శాతం వర్షపాతం నమోదయ్యింది. భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు ప్రైవేటు విద్యా సంస్థలకు యజమాన్యాలు సెలవు ప్రకటించాయి. వచ్చే గంటలో నగరమంతా భారీ వర్షం కురవనుంది. ఈ క్రమంలోనే నగర ప్రజలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. అవసరమైతే తప్ప బయటికి రావొద్దని సూచించింది.
ఇదిలా ఉంటే.. నేడు పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాటిలో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయిన జిల్లాల్లో మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలు ఉన్నాయి. ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.