కొన్ని రోజులుగా తడిసి ముద్దవుతోన్న తెలంగాణకు బిగ్ అలర్ట్.. గురువారం నుంచి 4 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాలు ఉద్ధృతంగా వీస్తున్నాయి. ఉత్తరాంధ్ర దగ్గర బంగాళాఖాతం తీర ప్రాంతంపై 7.6 కి.మీ ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది.
దీని ప్రభావంతో నేడు బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని ఐఎండీ ప్రకటించింది. మరో వైపు రుతు పవనాల గాలులు జైసల్మేర్ నుంచి మధ్యప్రదేశ్, రామగుండం, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకూ వ్యాపించి ఉన్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నాలుగు రోజుల పాటు భారీగా వర్షం పడే అవకాశాలు ఉన్నాయని ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉంది.