తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ద్రోణి, ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, మెదక్, మేడ్చల్, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ కేంద్రం.
కాగా ఆరెంజ్ అలర్ట్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్ర తెలిపింది. కాగా ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రానున్న రెండు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని రెయిన్ అలర్ట్ జారీ చేసింది.
మరో వైపు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ కూడా అప్రమత్తం అయింది. వరదలు, ప్రకృతి విపత్తులపై అప్రమత్తంగా ఉండేలా జిల్లా వారీగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులను నియమించింది. వాతావరణ శాఖ చేసే సూచనల మేరకు జిల్లాల వారీగా సంబంధిత టీమ్స్ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టనున్నాయి.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు.
హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు.