మరో 4 రోజులు తెలంగాణలో వర్షాలు.. ఏపీలో కూడా..
రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 13 July 2023 1:38 AM GMTమరో 4 రోజులు తెలంగాణలో వర్షాలు.. ఏపీలో కూడా..
రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గురువారం నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయని చెప్పింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
ఉత్తర తెలంగాణాలో మంచి జల్లులు కురవడంతో లోటు ఆందోళనలకు తెరపడింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగరంలోని పలు జంక్షన్లలో మధ్యాహ్నం కురిసిన వర్షంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ తర్వాత రెండు గంటల్లో వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే రోడ్లపై డ్రైనేజీ నీరు ప్రవహించడంతో పాదచారులు నడవడానికి ఇబ్బందిగా మారింది.
మరోవైపు ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర మీదుగా ఒక ఉపరిత ఆవర్తనం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మరో ఆవర్తనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పగటి పూట మబ్బులు, రాత్రవేళ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. మిగిలిన చోట్ల జల్లులు పడే అవకాశం ఉంది.