తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంలో విచారణ..మళ్లీ అదే జరిగింది

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.

By Knakam Karthik
Published on : 25 March 2025 2:02 PM IST

Telanagana, Congress, Brs, Party Defections, Supreme Court, TG Assembly Speaker

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంలో విచారణ..మళ్లీ అదే జరిగింది

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. రాష్ట్ర అసెంబ్లీకి 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ పిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ తో పాటు సుప్రీం కోర్టును.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కేటీఆర్ ఆశ్రయించారు. కాగా ఈ కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి సోమవారం సాయంత్రం కౌంటర్ దాఖలు చేశారు. దీంతో మంగళవారం రోజు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కేటీఆర్ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ప్రతివాదులుగా ఉన్న వారిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అనంతరం ఈ విచారణను సుప్రీం కోర్టు ఏప్రిల్‌ 2వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణలో ప్రతివాదుల వాదనలు కోర్టు వినే అవకాశం ఉంది. కాగా ఈ రోజు విచారణలో కౌశిక్‌రెడ్డి తరపున లాయర్ సుందరం, కేటీఆర్‌ తరపున శేషాద్రినాయుడు తమ వాదనలు వినిపించారు. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంపై అసెంబ్లీ కార్యదర్శి .. స్పీకర్ తరుఫున కౌంటర్ దాఖలు చేశారు. అందులో పిటిషనర్లు తప్పుడు ఉద్దేశంతో ఈ పిటిషన్ వేశారని.. స్పీకర్ కు ఫిర్యాదు చేసిన వెంటనే కోర్టును ఆశ్రయించారని.. ఈ పిటిషన్లను కొట్టివేయాలని అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Next Story