LTT తీవ్రవాదులకు ఆయనకు తేడా లేదు..గద్దర్‌పై బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు హాట్ కామెంట్స్
గద్దర్‌కు ఎల్‌టీటీ తీవ్రవాదులకు తేడా లేదని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 28 Jan 2025 12:18 PM IST
LTT తీవ్రవాదులకు ఆయనకు తేడా లేదు..గద్దర్‌పై బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు హాట్ కామెంట్స్
గద్దర్‌కు ఎల్‌టీటీ తీవ్రవాదులకు తేడా లేదని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల విషయంతో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది తెలిసిందే. గద్దర్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలని ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖపై విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. భారత రాజ్యాంగాన్ని విశ్వసించని గద్దర్‌కు పద్మ పురస్కారం ఎలా ఇస్తారని అన్నారు. అనేక మంది పోలీసులను చంపిన కేసులో కోర్టులకు తిరగలేనంటూ రాష్ట్రపతికి గద్దర్ లేఖ రాశారని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. గద్దర్ మావోయిస్టు లీడర్ అని.. ఆయన కుమార్తె ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు కాబట్టి గద్దర్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలా అని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీని చంపిన వారికి సీఎం రేవంత్ పద్మ పురస్కారం ఇవ్వమంటారా అని ఎద్దేవా చేశారు.
మాజీ మావోయిస్టు, రాజ్యాంగం వ్యతిరేకించిన వ్యక్తికి ఏ హోదాలో సీఎం రేవంత్ పద్మ అవార్డు అడుగుతున్నారని, ఉగ్రవాదులకు కూడా రేవంత్ పద్మ అవార్డులు అడుగుతారా అని ప్రశ్నిస్తున్నట్లు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గద్దర్‌ను మావోయిస్టుగా గుర్తించింది కాంగ్రెస్ పార్టీ అని, ఆయన్ను చంపడానికి ప్రయత్నించింది ఆ పార్టీయే అంటూ విమర్శలు చేశారు. తెలంగాణ సీఎం పద్మ అవార్డుల గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, పద్మ అవార్డుల ఎంపిక ప్రక్రియ కూడా తెలియని వారు సీఎం రేవంత్‌కు సలహాలు ఇస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. పబ్లిక్ డొమైన్‌లో ఓటింగ్ ద్వారా కూడా పద్మ పురస్కారాలు ఇస్తారన్న ఆయన, దరఖాస్తు చేయని మొగిలయ్యకు పద్మశ్రీ ఇచ్చారని అన్నారు.