ఫిబ్రవరి 6 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర : రేవంత్ రెడ్డి
Hath Se Hath Jodo Yathra Starts From February 6th. తెలంగాణలో ఫిబ్రవరి 6 నుంచి హాత్ హాత్ సే జోడో యాత్ర ప్రారంభమవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
By Medi Samrat Published on 21 Jan 2023 2:18 PM GMTతెలంగాణలో ఫిబ్రవరి 6 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడరు. ఫిబ్రవరి 6 నుంచి మొదలయ్యే పాదయాత్ర 60 రోజులపాటు సాగుతుంది. భద్రాచలం లేదా మహబూబ్ నగర్ లేదా ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ 3500 కి.మీ 150 రోజులుగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జోడో యాత్ర సాగిస్తున్నారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకు.. 150కోట్ల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఆయన జోడో యాత్ర మొదలు పెట్టారు. భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రతీ గుండెకు చేరవేయడానికే హాత్ సే హాత్ జోడో యాత్ర. వాస్తవానికి జనవరి 26 కాశ్మీర్లో రాహుల్ గాంధ యాత్ర ముగిస్తే ఆదే రోజు తెలంగాణలో యాత్ర మొదలు పెట్టాలనుకున్నాం. కానీ భద్రతా కారణాల చూపి జనవరి 26న కశ్మీర్ లో రాహుల్ గాంధీ జాతీయ జెండా ఎగరేయకుండా బీజేపీ కుట్ర చేస్తోంది. కశ్మీర్ లో జెండా ఎగరేసి తీరాల్సిందేనని రాహుల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30న కశ్మీర్ లో రాహుల్ జాతీయ జెండా ఎగరవేస్తారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ, సీఎల్పీ సహా తెలంగాణ ముఖ్య నాయకులంతా ముగింపు సభకు హాజరవుతారు. దాని తర్వాత ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్, ఫిబ్రవరి 3 నుంచి శాసనసభ సమావేశాలు, ఫిబ్రవరి 5న రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశం ఉంది.
ఈ దృష్ట్యా హాత్ సే హాత్ జోడో యాత్రను ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభిస్తున్నాం. ఫిబ్రవరి 6న హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి సోనియాగాంధీ లేదా ప్రియాంకా గాంధీ ని ముఖ్య అతిధిగా ఆహ్వానించాలని తీర్మానించాం. ఈ యాత్రలో హాత్ సే హాత్ సే జోడో యాత్ర స్టిక్కర్, రాహుల్ గాంధీ గారి లేఖ, మోదీ, కేసీఆర్ వైఫల్యాలపై చార్జీషీటు వంటి కార్యక్రమాలనకు ఏఐసీసీ కార్యక్రమాలు అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి, సంపత్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతాయి. జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాతాపాటు పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. దీంతో హాత్ సే హాత్ జోడో యాత్ర లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఈ యాత్రను సమన్వయం కోసం పరిశీలకులను నియమించడం జరుగుతుంది. బాధ్యతగా పని చేయని వారిని తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తాం. యాత్రలో పాల్గొనని వారిపై కూడా చర్యలుంటాయి. పార్టీ శ్రేయస్సు కోసం ఎవరైనా బహిరంగంగా మాట్లాడొచ్చు. కానీ పార్టీకి నష్టం కలిగించేలా ఉండకూడదని ఠాక్రే సూచించారు. పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడితే చర్యలు తప్పవు. ఫిబ్రవరి 6 లోగా కొత్త డీసీసీ లు బాధ్యతలు తీసుకుంటారు.
నాగర్ కర్నూల్ లో రేపు దళిత గిరిజన ఆత్మగౌరవ సభ
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో మార్కండేయ ప్రాజెక్టు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు తట్ట మట్టి తీయలేదు. ఈ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన నాగం పై బీఆరెస్ నేతల దాడిపై సమావేశంలో చర్చించాం. అంతేకాకుండా వారిపై కాకుండా బాధితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. మహిళ సర్పంచును అవమానించారని నాగం జనార్దన్ రెడ్డిపై కూడా కేసు పెట్టారు. నాగం వల్ల ఎలాంటి అవమానం జరగలేదని డీఐజీ దగ్గర ఆ మహిళా సర్పంచ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ విషయంపై అప్పట్లోనే డీజీపీ కూడా ముఖ్య నాయకులం ఫిర్యాదు చేశాం. అయినా ప్రభుత్వం తప్పు దిద్దుకోలేదు. అందుకే ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా నాగర్ కర్నూల్ లో రేపు దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే తో పాటు ముఖ్య నాయకులంతా హాజరవుతారు.