ఎప్పుడో అయిపోయిన దావోస్ దావత్‌కు ఇప్పుడెందుకు ప్రెస్‌మీట్?..సీఎం రేవంత్‌పై హరీష్‌రావు విమర్శలు
By Knakam Karthik Published on 28 Jan 2025 7:03 PM IST
ఎప్పుడో అయిపోయిన దావోస్ దావత్‌కు ఇప్పుడెందుకు ప్రెస్‌మీట్?..సీఎం రేవంత్‌పై హరీష్‌రావు విమర్శలు
దావోస్ పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్‌పై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఎప్పుడో అయిపోయిన దావోస్‌కు ఇప్పుడెందుకు దావత్ అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్ ఎలా ఉందంటే.. పెట్టుబడుల కట్టు కథను నమ్మించేందుకు శత విధాలా ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఉందని విమర్శించారు.
ముఖ్యమంత్రి @revanth_anumula ప్రెస్ మీట్ ఎలా ఉందంటే.. పెట్టుబడుల కట్టు కథను నమ్మించేందుకు శత విధాలా ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఉంది.మీ ప్రెస్ రిలీజులు, మీ మీడియా కవరేజులు, మీ ఈనో స్టోరీలు ఎవరూ నమ్మడం లేదని, ప్రెస్ మీట్ పెట్టావు.ఎప్పుడో అయిపోయిన దావోస్ కు ఇప్పుడు…
— Harish Rao Thanneeru (@BRSHarish) January 28, 2025
మీ ప్రెస్ రిలీజ్‌లు, మీ మీడియా కవరేజ్‌లు, మీ ఈనో స్టోరీస్ ఎవరూ నమ్మడం లేదని ప్రెస్ మీట్ పెట్టారంటూ ఎద్దేవా చేశారు. దావోస్‌లో జరిగే ఎంవోయూలు అన్నీ కూడా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే, ఎవరైనా ఓపెన్ టెండర్‌లో రావాల్సిందే.. అని రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి అంటే, మీరేమో లక్షా 82 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు గప్పాలు చెబుతున్నారని విమర్శించారు.
పొంతన లేకుండా చెప్పిన కంపెనీలు, పెట్టుబడుల లెక్కలు యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించిందని, అంతా డొల్ల ప్రచారం అని తేలిపోయిందని ఆరోపించారు. రైతు భరోసా కోసం గంపెడు ఆశతో, కొండంత ఆందోళనతో ఎదురుచూస్తున్న రైతుల ఆరాటాన్ని చిల్లర పంచాయితీ అంటవా అని నిలదీశారు. సంక్రాంతికి ఇస్తానన్న సంగతి తేలిపోయింది, చబ్బీస్ (26) జనవరి చేదు మాత్రనే అయ్యింది, ఇప్పుడు మార్చి 31 దాకా గడువు పెంచినవు.. అంటూ విమర్శించారు.