మూసీ కాలుష్యం కంటే.. ముఖ్యమంత్రి నోటి కాలుష్యం ఎక్కువైంది : హరీశ్‌రావు
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 21 Dec 2024 6:30 PM ISTఅసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్‌ఎల్పీలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రసంగం తీరు.. మైకులో రంకెలు వేసి, గజ్జెల లాగేసుకుని.. పోతురాజు తీరుగా పడేల్ పడేల్‌మని ఆయనది ఆయనే కొట్టుకుని పారిపోయినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అబద్ధాలను అడ్డుకునేటోడు లేడు.. ఆపటోడు లేడని విమర్శించారు. పదేండ్ల పాట తప్ప కొత్తగా చెప్పింది లేదు.. చేసింది అంతకన్నా లేదని అన్నారు. సబ్జెక్ట్ లేనోడికి వదురుడు ఎక్కువ.. చేతగానోడికి ఏతులెక్కువ అని సెటైర్ వేశారు. ముఖ్యమంత్రిగా నీకు మైక్ దొరకడమే రేవంత్ రెడ్డికి ఉన్న అనుకూలత అని అన్నారు. అదే మైక్ తమకు ఇవ్వద్దని ముఖ్యమంత్రే స్పీకర్‌కు చెప్పాడని ఆరోపించారు. ఇప్పటికే చాలా అబద్ధాలు చెప్పా.. బీఆర్‌ఎస్‌కు మైక్ ఇస్తే.. నా అబద్ధాలను బయటపెడతారంటూ.. మైక్ ఇవ్వద్దని పరోక్షంగా స్పీకర్‌కు చెప్పి బయటకు పారిపోయాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి తెలిసింది గోరంత.. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి.. ఇవాళ అసెంబ్లీలో కూడా అబద్ధాలతోనే పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. మూసీ కాలుష్యం కంటే.. ముఖ్యమంత్రి నోటి కాలుష్యం ఎక్కువైందని అన్నారు. ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కటన్నా నిజం చెప్పావా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి గొంతు చించుకోవడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో గిన్నిస్ రికార్డును రేవంత్ రెడ్డి బద్ధలగొడుతున్నారని అన్నారు. రేవంత్ అబద్ధాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలన్నారు.
రేవంత్ రెడ్డి చేసిన రెండు గంటల ప్రసంగంలో రైతు భరోసా ఎప్పుడిస్తారో? ఎంతిస్తారో? ఒక్క ముక్క కూడా చెప్పలేదని హరీశ్‌రావు విమర్శించారు. రెండు లక్షలకు పైగా ఉన్న అప్పును కడితే రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. ఆయన మాట నమ్మి చాలామంది రైతులు రెండు లక్షలకు పైగా ఉన్న రుణాన్ని కట్టేశారు.. మరి వాళ్లకు రుణమాఫీ ఎప్పుడు చేస్తావని ప్రశ్నించారు. గత నెల 30వ తేదీన మహబూబ్‌నగర్ వెళ్లిన రేవంత్ రెడ్డి.. 2750 కోట్లను విడుదల చేశానని చెప్పాడన్నారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క రైతు బ్యాంకులో ఆ డబ్బు జమ కాలేదని అన్నారు. రేవంత్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని.. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అప్పుల విషయంలో మొన్న ప్రభుత్వం నోరు మూయించామని హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వం చెప్పిన అబద్ధాలను లెక్కలు, అంకెలతో సహా చూపించి, అప్పు రూ.4.17 లక్షల కోట్లే అని బల్లగుద్ది చెప్పి ప్రభుత్వం నోరు మూయించామని అన్నారు. ఈ ఐదారు రోజులుగా సభలో ప్రభుత్వం తేలిపోయింది.. అందుకే రేవంత్ రెడ్డి తన కడుపులో ఉన్నదంతా ఇవాళ కక్కేశాడని విమర్శించారు. రైతు భరోసా మీద ఇవాళ జరిగిన చర్చ అంతా రాజకీయ ఉపన్యాసంగానే ఉందని హరీశ్‌రావు విమర్శించారు.