గెస్ట్ లెక్చరర్ల జీతాలు చెల్లించి, మీ పరువు కాపాడుకోండి: హరీశ్‌రావు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ గెస్ట్ లెక్చరర్ల పెండింగ్ జీతాల చెల్లింపుపై మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు

By -  Knakam Karthik
Published on : 8 Oct 2025 12:20 PM IST

Telangana, Congress government, Harishrao, inter guest lecturers, pending salary payment

గెస్ట్ లెక్చరర్ల జీతాలు చెల్లించి, మీ పరువు కాపాడుకోండి: హరీశ్‌రావు

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ గెస్ట్ లెక్చరర్ల పెండింగ్ జీతాల చెల్లింపుపై మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్‌లో స్పందిస్తూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్‌లో 9 నెలలుగా జీతాలు రాక ఇంటర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్స్ ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకపోవడం దుర్మార్గం. బతుకమ్మ, దసరా పండుగలు కూడా జరుపుకోకుండా లెక్చరర్లు పస్తులు ఉండేలా చేసిన పాపం ఈ పాపిష్టి కాంగ్రెస్ ప్రభుత్వానిది. నెలల తరబడి జీతాలు పెండింగ్ లో ఉంటే వారి బతుకు ఎలా సాగుతుంది, కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది. అధికారులను కలిసి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో, ఓపిక నశించి కళాశాలకు వెళ్లకూడదని నిర్ణయించున్నారు.

లెక్చరర్లు కళాశాలలకు వెళ్లకుంటే విద్యార్థులకు పాఠాలు ఎవరు చెబుతారు? సిలబస్ ను ఎవరు పూర్తి చేస్తారు? మీ నిర్లక్ష్యం వల్ల లెక్చరర్లే కాదు, విద్యార్థులు నష్టపోవాల్సి వస్తున్నది. పాఠాలు చెప్పే గురువులకే గౌరవం ఇవ్వని ప్రభుత్వం..ఇక విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తుంది? సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని గెస్ట్ లెక్చరర్ల వేతనాల పరిస్థితి ఇంకెంత దారుణమో ఊహించుకోవచ్చు. సీఎం రేవంత్ గారూ.. కోతలు కోయడం ఆపేసి, ఉద్యోగులకు జీతాలు చెల్లించడంపై దృష్టి సారించండి. మీ సొంత జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఇంటర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్ల వేతనాలు వెంటనే విడుదల చేసి, మీ పరువు కాపాడుకోండి..అని హరీశ్‌ రావు ట్వీట్ చేశారు.

Next Story