జహీరాబాద్ వీధుల్లో సైకిల్‌పై మంత్రి హరీష్ రావు
Harish Rao holds 'Nagarabata' prog, visits Zaheerabad on cycle. త్వరలో జహీరాబాద్ రూపురేఖలు మారిపోతాయని వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
By Medi Samrat Published on 19 April 2022 10:20 AM GMTత్వరలో జహీరాబాద్ రూపురేఖలు మారిపోతాయని వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. 'నగరబాట' కార్యక్రమంలో భాగంగా సైకిల్‌పై జహీరాబాద్‌లోని దారులు, బైలేన్‌లలో ఆయన పర్యటించారు. జహీరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించిందని, జరిగిన పనులను పరిశీలించేందుకు హరీశ్‌రావు సైకిల్‌పై జహీరాబాద్‌లోని ప్రతి మూల, కాలనీలను సందర్శించినట్లు సమాచారం. పర్యటనలో భాగంగా హరీష్ రావు అక్కడక్కడ ఆగి నివాసితులతో సంభాషించారు.
అక్కడి స్థానికులతో మంత్రి మట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను నిర్మించడంతో పాటు నాలుగు లైన్ల రోడ్లు కూడా వేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. నిమ్జ్ (నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ జోన్) వంటి అభివృద్ధి పనుల ప్రాజెక్టులు జహీరాబాద్ రూపురేఖలను శాశ్వతంగా మారుస్తాయన్న హరీశ్‌రావు, మిషన్ భగీరథ కార్యక్రమం కింద తాగునీటి సమస్యలను అధికారులు పరిష్కరించారని తెలిపారు. సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (ఎస్‌ఎల్‌ఐపి), బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (బిఎల్‌ఐపి) ద్వారా నియోజకవర్గంలోని ప్రతి మూలకు సాగునీరు అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులకు ప్రభుత్వం రూ.4 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందని మంత్రి తెలిపారు.
మహిళలు, వృద్ధులు, చిన్నారులతో మాట్లాడిన హరీశ్‌రావు.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ కాలనీలో ఏయే అభివృద్ధి పనులు వెంటనే అవసరమో తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వం రూ.75 కోట్లు వెచ్చించి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తుందని హామీ ఇచ్చారు. జహీరాబాద్ అభివృద్ధిని కాంగ్రెస్ నేతలు విస్మరించారని హరీశ్‌రావు విమర్శించారు. గీతారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యాక కూడా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నించలేదన్నారు.