కత్తి చంద్రబాబుది.. పొడిచేది రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి హరీశ్ రావు

రాజకీయాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమ‌ని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

By -  Medi Samrat
Published on : 30 Jan 2026 2:12 PM IST

కత్తి చంద్రబాబుది.. పొడిచేది రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి హరీశ్ రావు

రాజకీయాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమ‌ని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఇదొక ముఖ్యమైన మీడియా సమావేశం. అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి కల్పించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.. కాళోజీ గారు ముందే ఊహించి చెప్పినట్లు.. ప్రాంతం వాడే తెలంగాణకు చేస్తున్న ద్రోహం ఇది. దేశ రాజధాని డిల్లీ కేంద్రంగా తెలంగాణకు జరుగుతున్న జల ద్రోహాన్ని వివరించేందుకే ఈ ప్రెస్ మీట్.. ఒక వేళ ఆ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డే గా మిగిలిపోతుందన్నారు.

గోదావరి నదీ జలాల అక్రమ తరలింపు విషయంలో BRS మొదటి నుండి అప్రమత్తం చేస్తూనే వస్తుంది. గతంలో అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టినం. వాస్తవాలు బయట పెట్టినం. నామమాత్రంగా బ్యాక్ డేట్ వేసి లెటర్లు మీడియాకు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ముల్లు కర్రతో పొడుస్తూ మొద్దు నిద్ర లేపుతున్నం. అది బనకచర్ల అయినా, నల్లమల సాగర్ అయినా మారింది పేరు మాత్రమే కానీ, ఏపీ జల దోపిడి ఆగలేదు.. జల ద్రోహం విషయంలో కత్తి చంద్రబాబుది అయితే, పొడిచేది రేవంత్ రెడ్డి అని ఆరోపించారు.

సమైక్య పాలనలో మనకు నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్.. నేడు మరో చారిత్రక ద్రోహం చేస్తున్నది. ఈరోజు డిల్లీలో జరుగుతున్న ఇరిగేషన్ మీటింగ్ సాక్షిగా రేవంత్ ప్రభుత్వం మరణ శాసనం రాయబోతున్నది. పోలవరం నల్లమల సాగర్ విషయంలో రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి సహకరిస్తున్నది. ఆ కుట్రల తీరు గమనిస్తే.. పోను పోను అనుకుంటూనే రేవంత్ రెడ్డి ఆనాడు డిల్లీ మీటింగ్ కు వెళ్ళాడు.. ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జరిపాడు.. పెట్టబోను అంటూనే సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాల హక్కులను కాలరాసాడు.. వేయను అంటూనే కమిటి వేసి ఏపీ జల దోపిడీకి రెడ్ కార్పెట్ వేశాడని దుయ్య‌బ‌ట్టారు.

టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీం కోర్టుకు వెళ్ళి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపాడన్నారు. పస లేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమల సాగర్ కు మద్దతు ప్రకటించాడు. దానికి వాపస్ తెచ్చుకున్నడు ఉత్తం.. ప్లాన్డ్ గా సహకరిస్తూ చంద్రబాబుకు రేవంత్ గురు దక్షిణ చెల్లిస్తున్నడ‌న్నారు. ఏపీ ఒత్తిడితో జరుగుతున్న మీటింగ్ లో నేడు ఇంజినీర్లు పాల్గొంటున్నారు. పేరుకు జలవివాదాల మీటింగ్ కానీ, మన 200 టీఎంసీలను గంపగుత్తగా తరలించుకుపోయే నల్లమలసాగర్ అనే ప్రాజెక్టుకు సంబంధించిన కుట్ర ఇది. ఇలాగే గతంలో కేంద్ర జల్‌శక్తిశాఖ నిర్వహించిన సమావేశంలో ఏపీ ఈ ప్రాజెక్టునే ఏకైక ఎజెండాగా ముందుపెట్టిందని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఏపీ నల్లమలసాగర్‌ లింకు ప్రాజెక్టునే తెరమీదకు తెచ్చి చర్చ చేస్తున్నరు. బిఆర్ఎస్ నిలదీస్తే.. డిసెంబర్ 30వ తేదీన నేను ఉత్తరం రాస్తే.. తెల్లారి ఒక మీటింగ్ రాసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో ఏముంది.. ఏపీ నల్లమల సాగర్ విషయంలో ముందుకు పోతుంది, డిపిఆర్ ప్రక్రియ ముందుకు పోతుంది అని స్పష్టంగా రాసింది. దీంతో పాటు ఇంకేం రాసారు.. రెండు కండీషన్లకు ఒప్పుకుంటేనే ఢిల్లీ మీటింగ్ కు వస్తం అన్నరు. మొదటి కండీషన్ ఏమిటంటే నల్లమల సాగర్ కు డిపిఆర్ వెంటనే ఆపాలి, కేంద్రం అనుమతుల ప్రక్రియను తక్షణం ఆపాలి అని.. రెండోది.. ప్రీ ఫీజబులిటి రిపోర్టు ఆపినట్లు ఏపీ హామి ఇవ్వాలని రాసారు? నా ప్రశ్న ఏమిటంటే.. ఈ రెండు కండీషన్లకు కేంద్రం హామి ఇచ్చిందా? ఏపీ హామి ఇచ్చిందా? నీ అప్రువల్ తోనే లెటర్ పోయింది కదా ఉత్తం గారు ఎందుకు హామి లేకుండా పాల్గొంటున్నారు. ఎందుకు ఈరోజు మీటింగ్ కు ఎగేసుకొని పోయారని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి పట్టించుకోడు, మీరైనా ఎందుకు పట్టించుకోరు ఉత్తం గారు.. ఈ మీటింగ్ కు వెళ్లేది ఆదిత్యా నాథ్. గతంలో 9వ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ లో పాల్గొన్న ఆదిత్యా నాథ్ దాస్ గారు.. కాళేశ్వరం, గోదావరి, సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టు, తుపాకులగూడెం, మిషన్ భగీరథ, చనాక కొరటా, రామప్ప డైవర్షన్ లు అన్నీ అక్రమ ప్రాజెక్టులు, వీటిని నిలిపి వేయాలని చెప్పాడు. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా వ్యతిరేకించిన వ్యక్తిని మీటింగ్ కు పంపడం అంటే తెలంగాణ ద్రోహం చేయడానికే కాదా? అని ప్ర‌శ్నించారు.

మన తెలంగాణ నీళ్లను ఏపీకి తీసుకువెళ్లే కుట్ర ఇది. తెలంగాణ సోయి ఉన్న ఒక్క ఇంజినీర్ దొరకలేదా? దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు చేస్తున్నారని ఆరోపించారు. పోను పోను అంటూనే మీటింగ్ లకు అటెండ్ అవడం అంటే ఏమిటి? తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి అప్ప చెప్పడమేనా మీ చర్చల లక్ష్యమా? అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ గారు గోదావరిలో 400 టిఎంసీలు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చారు. గోదావరి మీద 10 డిపిఆర్ లు పంపి 7 ప్రాజెక్టులకు అనుమతులు సాధించారు. రెండేళ్లలో ఒక్క డిపిఆర్ పంపింది లేదు, ఒక్క అనుమతి తెచ్చింది లేదన్నారు. వార్దా, కాళేశ్వరం మూడో టిఎంసీలకు సగం అనుమతులు వస్తే, పూర్తి చేయకుండా డీపీఆర్ లు వాపస్ చేసింది. రేవంత్ రెడ్డి పాలనలో డిపిఆర్ లు వాపస్ వచ్చిన పరిస్థితి. మన డిపిఆర్ లు వాపస్ తెచ్చుకుంటవు, నల్లమల సాగర్ కు జెండా ఊపుతవు. అలాంటి చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి.. నిన్ను తెలంగాణ సమాజం క్షమించదు అన్నారు. తెలంగాణ నీటి హక్కులను కాలరాసేందుకు ఏపీ ఒత్తిడితో కేంద్రం నిర్వహిస్తున్న ఈరోజు ఢిల్లీ సమావేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు పెట్టిన కండీషన్లకు వచ్చిన సమాధానం బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి.. నీ గురుదక్షిణ కోసం తెలంగాణకు ద్రోహం చేస్తుంటే తెలంగాణను సాధించిన బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు.. నీ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. తెలంగాణ నీటి హక్కుల కోసం మరో పోరాటం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

కేసీఆర్ పాలన గురించి ఎకనామిక్ సర్వే రిపోర్టే స్పష్టం చేసింది. తెలంగాణ అద్బుతమైన ప్రగతి సాధించింది. రెండు కోట్ల 20లక్షల ఎకరాల మాగాణిగా మారింది. కాళేశ్వరం, మిషన్ కాకతీయ ద్వారా అద్బుతమైన ఆయకట్టు వచ్చింది. కాళేశ్వరం ద్వారా 17 లక్షల 823 ఎకరాల స్థిరీకరణ, మిషన్ కాకతీయ ద్వారా పదిహేను లక్షల ఎకరాల ఆయకట్టు సాధ్యమైంది. 32 లక్షల ఎకరాల ఆయకట్టు బిఆర్ఎస్ సాధించింది. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇప్పటికైనా నోరు పారేసుకోవడం మంచిది. కేంద్రంలోని మీ ప్రభుత్వమే తెలంగాణ ప్రగతి పథాన్ని వివరిచింది. కళ్లు తెరవండి అనవసరంగా బిఆర్ఎస్ మీద నోళ్లు పారేసుకోకండి.. మేమేమో తెలంగాణకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తే, రేవంతు ఏపీకి నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేసిండు.. నీటిని ఒడిసి పట్టింది కేసీఆర్ విడిచి పెట్టింది రేవంత్.. సోయి లేని రేవంత్ నల్లమల సాగర్ కు జెండా ఊపుతున్నడు.. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం మీటింగ్ బాయ్‌కాట్ చేయాలి.. ఢిల్లీకి, దావోస్ కు తిరగడమే తప్ప పాలన మీద దృష్టి లేదు.. బీఆర్ఎస్ సేద్యంపై దృష్టి సారిస్తే, రేవంత్ చోద్యం చూస్తున్నడని ఎండ‌గ‌ట్టారు.

Next Story