అది డొల్ల కేసు.. కేటీఆర్‌కు హ‌రీష్ రావు అభినందనలు

రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసును పరిశీలించిన హైకోర్టు కేటీఆర్ ని అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు ఇవ్వడం పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on  20 Dec 2024 9:04 PM IST
అది డొల్ల కేసు.. కేటీఆర్‌కు హ‌రీష్ రావు అభినందనలు

రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసును పరిశీలించిన హైకోర్టు కేటీఆర్ ని అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు ఇవ్వడం పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. కేటీఆర్ తొలి అడుగులోనే నైతిక విజయం సాధించారని.. అభినందనలు తెలియ‌జేశారు. హైకోర్టు ఉత్తర్వులతో ఇది డొల్ల కేసని తేటతెల్లమైందన్నారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాల మాట్లాడారు. గోబెల్స్ ప్రచారం చేసారన్నారు. ఈ కార్ రేసింగ్ మీద సభలో చర్చ జరపాలని అడిగాం.. వాస్తవాలు ప్రపంచానికి చెబుదాం.. ప్రజలకు వాస్తవాలు తెలియాలి అని అడిగినం.. స్పీకర్ ను మొన్నే కలిసి అడిగాం.. ఈరోజు సభలో అడిగాం.. మమ్మల్ని బయటకు పంపి సభలో చర్చ కొనసాగించారన్నారు.

కేసు పెట్టవద్దు అని మేం అడగటం లేదు, చర్చ పెట్టండి అని అడిగాం.. ఎందుకు ఒప్పుకోలేదు. ప్రజలకు వాస్తవాలు తెలియవద్దా అని ప్రశ్నించారు. ఫార్ములా-ఈ రేసులో రూ. 600 కోట్ల అవినీతి అంటూ సీఎం అసత్యాన్ని చెప్పే ప్రయత్నం చేసిండు.. మిగతా 50 శాతం చెల్లించకపోవడం వల్ల రద్దు చేసుకుంటున్నాం.. అందుకు అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నం అని సదరు సంస్థ చెప్పిందన్నారు. 45 లక్షల పౌండ్స్ అంటే సుమారు రూ. 47 కోట్లు.. కాని రేవంత్ రెడ్డి రూ. 600 కోట్ల నష్టం అంటున్నారు. మేం సభలో లేకుంటే శుద్ధ తప్పులు చెప్పార‌న్నారు.

వాస్తవానికి రూ. 700 కోట్ల లాభం రాష్ట్రానికి జరిగింది.. రేవంత్ తుగ్లక్ పనుల వల్ల, పిచ్చి పని వల్ల రూ. 700 కోట్ల నష్టం రాష్ట్రానికి జరిగిందన్నారు. ఫార్ములా-ఈ రేస్ నిర్వహణ వల్ల ఆరేడు వందల కోట్లు హైదరాబాద్‌కు మేలు జరిగింది అని 2022లో నీల్సన్ అనే ప్రఖ్యాత సంస్థ చెప్పింది.. రేవంత్ రెడ్డి మాటలు శుద్ధ అబద్ధం. రేవంత్ రెడ్డి రాష్ట్ర ఇమేజ్‌ని దెబ్బ తీశార‌న్నారు. అసలు కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టారు.. అవినీతి జరగలేదు, మరి ఏసీబీ కేసులు ఎందుకు పెట్టిందన్నారు. రాష్ట్ర ఖజానా నుంచి, నేషనల్ బ్యాంకు నుంచి ఆ సంస్థకు డబ్బులు పంపారు. ఇందులో అవినీతి ఏముంది.. ప్రొసీజురల్ లాప్స్ జరిగినయి కావొచ్చు, అవినీతి లేదన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న అవినీతి జరగలేదు, ప్రొసీజురల్ లాప్స్ జరిగింది అన్నడు.. వస్తు రూపేనా, ధన రూపేనా అవినీతి జరిగితే ఏసీబీ పని చేస్తది.. మే బీ ఇర్రెగ్యులారిటీ బట్ నాట్ ఇల్లీగాలిటీ అన్నారు. 2022లో ఈవెంట్ జరిపితే 192 దేశాల ప్రజలు చూసారు.. తెలంగాణ ఖ్యాతి పెరిగింది. రూ.42 కోట్లతో తమిళనాడులో ఫార్ములా 4 నిర్వహించింది, ఉత్తర్‌ప్రదేశ్ రూ. 1700 కోట్లతో ఫార్ములా వన్ నిర్వహించింది. రూ. 103 కోట్లతో చంద్రబాబు 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించారు. కాంగ్రెస్ ఢిల్లీలో కామన్‌వెల్త్ గేమ్స్ రూ. 70 వేల కోట్లతో నిర్వహించారు.. అదొక స్కాం అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కేటీఆర్ ను అభినందించారన్నారు.

అలవిగాని హామీలిచ్చి రేవంత్ ప్రజలను మభ్యపెట్టిండు.. ముఖ్యమంత్రి అయితే అయ్యిండు గానీ, ఆయన ఇచ్చిన హామీలు ఎట్ల అమలు చెయ్యాలె అని తలుచుకొని భయంల పడ్డడు.. ఎట్లనన్న గట్టెక్కాలె.. తిమ్మిని బమ్మిని చెయ్యలె అనే ఆలోచనతో హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రమే దివాళా తీసిందనే దివాలాకోరు ప్రచారం మొదలుపెట్టిండని అన్నారు. రాష్ట్రం దివాల తీసింది అన్నడు. పెట్టుబడులు రావటం లేదు. దివాలా దివాలా అని తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డడన్నారు. ఏడు లక్షల కోట్ల అప్పు కాదు, నాలుగు లక్షల 17 వేల కోట్ల అప్పే అని శాసనసభ సాక్షిగా నోరు మూయించినం.. గ్యారెంటీల గారడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిండు.. రాష్ట్ర పరపతి, ప్రతిష్టను దెబ్బతీసిండన్నారు. మార్పు మార్పు అని అధికారంలోకి వచ్చిన్రు. ఏడాది కాలంలో ఏం మార్పు వచ్చిందన్నారు. కాంగ్రెస్ చేతికి అధికార మార్పిడి తప్ప, ప్రజల జీవితాల్లో ఏం మార్పు వచ్చిందన్నారు. ప్రభుత్వం మీద గట్టిగ మాట్లాడితే చాలు కేసులు.. ఇచ్చిన హామీలు ఏమైనయి అంటే చాలు అరెస్టులు.. రోడ్డెక్కి శాంతియుతంగా నిరసన తెలిపినా నిర్బంధాలు.. ఏం చేసిండు మా కేటీఆర్.. నీ అవినీతి బండారాన్ని సిస్టమేటిక్‌గా ఎప్పటికప్పుడు బయటపెడుతున్నడు.. నీ స్కాంలను, నీ స్కీంలను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతున్నడు.. నీతో సహా నీ బ్రదర్స్, నీ అల్లుడు, నీ బామ్మర్ది బాగోతాలను బయటపెట్టి మీకు నిద్ర లేకుండా చేస్తున్నడు.. ప్రజల భవిష్యత్తు గురించి కాదు, నీ ఆర్ఆర్ బ్రదర్స్ గురించే ఫోర్త్ సిటీ, ఫిఫ్త్ సిటీ అని ప్రజలకు అర్థమయ్యేలా వివరించిండు.. మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో నువ్వు చేస్తున్న లూటిఫికేషన్‌ను బయటపెట్టిండు.. ఇవన్నీ చేసిండు కాబట్టి, నీకు వశపడక. ఏదో ఒక కేసు పెట్టాలె, ఎట్లనైనా జైల్లో వేయాలనే కుట్రకు కొన్ని నెలలుగా తెరలేపినవు.. అరెస్టులతో లీడర్లను, క్యాడర్‌ను భయబ్రాంతులకు గురిచేసి నీ కుంభకోణాలను, లంబకోణాలను యథేచ్చగా కొనసాగించుకోవాలని చూస్తున్నావ‌ని హ‌రీష్ రావు ధ్వ‌జ‌మెత్తారు.

Next Story