దాడి రేవంత్ రెడ్డి చేయించారు : హరీశ్ రావు
హైదరాబాద్ నగరంలో పట్టపగలు ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహ వ్యక్తం చేశారు
By Medi Samrat Published on 12 Sep 2024 11:10 AM GMTహైదరాబాద్ నగరంలో పట్టపగలు ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహ వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా కార్యకర్తలను గృహ నిర్భందం, అరెస్టులు చేసి పైలెట్, ఎస్కార్ట్ ఇచ్చి మా ఎమ్మెల్యే ఇంటిపై కాంగ్రెస్ వాళ్ళను దాడికి పంపారని అన్నారు. సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది. ఖమ్మంలో వరద భాధితుల పరామర్శకు వెళ్తే మాపై దాడి చేశారని అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పింది గాంధీ కాదా..? అని ప్రశ్నించారు. మా ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేసి పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిపై దాడి రేవంత్ రెడ్డి చేయించారని ఆరోపించారు. ఏసీపీ, సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు కాపాడారు. పెట్టుబడులు స్వర్గధామంగా హైదరాబాద్ ను కేసీఆర్ చేశారు. కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయన్నారు. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలయ్యిందన్నారు. ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం.. రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఏం చేయదలుచుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో తొమ్మిది కమ్యూనల్ ఘటనలు చోటుచేసుకున్నాయి. తొమ్మిది నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రతిష్టపాలు అయ్యింది.. మా సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని హెచ్చరంచారు.
మాకు తెలంగాణ ప్రజలు,హైదరాబాద్ ముఖ్యం అన్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి విషయంలో స్పీకర్ స్పందించాలని కోరారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మాటల్లో ప్రజా పాలన.. రాహుల్ గాంధీ చేతుల్లో రాజ్యాంగం.. కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ మందలిస్తారా లేదా చెప్పాలి.. రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై నమ్మకం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ దోపిడీ, మోసాలు, ఆరు గ్యారెంటీల గారడీని దేశం మొత్తం వివరిస్తామన్నారు. దాడిపై సైబరాబాద్ సీపీకి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేస్తారన్నారు.