'ముక్కు నేలకు రాస్తారా?'.. మంత్రి కోమటిరెడ్డికి హరీష్ రావు బహిరంగ సవాల్
తనపై ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
By అంజి Published on 2 Jun 2024 8:30 PM IST
మంత్రి కోమటిరెడ్డికి హరీష్ రావు బహిరంగ సవాల్
సిద్దిపేట : తనపై ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద తన పాస్‌పోర్టు, విమాన టిక్కెట్లు, హోటల్ వసతి వివరాలతో పాటు తన అమెరికా పర్యటన వివరాలను అందజేస్తానని హరీశ్‌రావు ఆదివారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి టీ ప్రభాకర్ రావును హరీశ్ రావు అమెరికాలో పర్యటిస్తూ కలిశారని వెంకట్ రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. కనీస జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి ఇలా మాట్లాడటం చౌకబారుతనం అంటూ వ్యంగంగా వ్యాఖ్యానించారు.
''నేను అమెరికా వెళ్లి, ప్రభాకర్ రావుని కలిసినట్లు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయడానికి నేను సిద్ధం.. రుజువు చేయకపోతే వెంకట్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలి'' అని హరీశ్ రావు సవాల్ విసిరారు.
తన వద్ద ఉన్న ఆధారాలతో బహిరంగ చర్చకు రావాలని వెంకట్ రెడ్డిని కోరారు. ఇలాంటి ప్రకటనలతో ఆర్‌అండ్‌బీ మంత్రి మతిస్థిమితం కోల్పోయినట్లు కనిపిస్తోందని హరీష్ రావు అన్నారు. ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిదన్నారు. అమరవీరుల స్మారక స్థూపంపై బహిరంగ చర్చ అనంతరం ఇలాంటి ఆరోపణలు చేసినందుకు వెంకట్ రెడ్డి తనకు క్షమాపణ చెప్పాలని అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తున్నారని, ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు ప్రతిపక్ష పార్టీ నేతలపై అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు.