ఎన్నికల సమయంలో రకరకాల ఊహాగానాలు రావడం సాధారణం అని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మీడియాతో చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. వివిధ కారణాల రీత్యా మా తనయుడు అమిత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ నుండి వెనక్కి తగ్గారని పేర్కొన్నారు. స్థానిక పరిస్థితులు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల తీరుతో నిర్ణయం మార్చుకున్నాడని వెల్లడించారు. ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం.. నిర్మాణం లోపాల వల్లే నేతలు పార్టీ వీడుతున్నారనే చర్చ నడుస్తోందన్నారు.
కాంగ్రెస్ లో అమిత్ రెడ్డి చేరికకు గతంలో ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమని.. కానీ ఆ తరువాత ఎటువంటి చర్చ లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి మా సమీప బంధువని వెల్లడించారు. వేం నరేందర్ రెడ్డితో మా తనయుడు అమిత్ భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రాలేదన్నారు. కాంగ్రెస్ 100 రోజుల పాలన విషయంలో ప్రజల్లో సానుకూలత ఉందన్నారు. ప్రజల అభిప్రాయమే నా అభిప్రాయమని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.