మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు.. గవర్నర్ స్పందన ఇదే
Governor's response to Minister KTR's comments. తెలంగాణ క్యాబినెట్ సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ తెలంగాణ
By Medi Samrat
తెలంగాణ క్యాబినెట్ సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ తెలంగాణ గవర్నర్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాజకీయాలను చేస్తోందన్నారు. కేంద్రం చట్టసభలకు ఉన్న అధికారాలను కుదిస్తూ, ప్రజల అభిప్రాయాన్ని అపహాస్యం చేస్తోందని.. తెలంగాణ శాసనసభ పాస్ చేసిన బిల్లులను తిరిగి పంపిన వ్యవహారం దారుణమన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించి ఆమోదించి పంపిన మూడు బిల్లులను గవర్నర్ వెనక్కి పంపారన్నారు. వాటన్నింటినీ మళ్లీ అసెంబ్లీ సమావేశాల్లో పాస్ చేస్తామని.. వాటిని గవర్నర్‌కు తిరిగి పంపుతామన్నారు. రెండోసారి పాస్ చేసిన బిల్లులను గవర్నర్ ఎవరున్నా, రాజకీయంగా ఏరకమైన ఆలోచనలు ఉన్నా వాటన్నింటినీ ఆమోదించాల్సిందేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ కు సఖ్యత లేదనే విషయం బయటకు వచ్చింది.
ఈ ఆరోపణలపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను తిప్పి పంపడం తన ఉద్దేశ్యం కాదన్నారు. బిల్లులను ఎందుకు రిజెక్ట్ చేయాల్సిందో కూడ కారణాలు వివరించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వం తనను కావాలని తప్పుబడుతుందన్నారు. తాను చెప్పిన కారణాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలని చెప్పారు. భారీ వర్షాలు, వరదల కారణంగా తాను ప్రభుత్వాన్ని నివేదిక అడిగానని తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి నివేదిక రాగానే కేంద్రానికి పంపుతానని గవర్నర్ అన్నారు.