రిజర్వేషన్ల బిల్లుకు కాదు..పంచాయతీ రాజ్‌ బిల్లుకు గవర్నర్ ఆమోదం

తెలంగాణ పంచాయ‌తీ రాజ్ (రెండో స‌వ‌ర‌ణ‌) చ‌ట్టం,2025 బిల్లు పై గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేశ్ వర్మ సంత‌కం చేయ‌డంతో గెజిట్ విడుద‌ల‌య్యింది.

By -  Knakam Karthik
Published on : 12 Sept 2025 7:09 AM IST

Telangana, Congress Government, Panchayati Raj (Second Amendment) Act, Governor

తెలంగాణ పంచాయ‌తీ రాజ్ (రెండో స‌వ‌ర‌ణ‌) చ‌ట్టం,2025 బిల్లు పై గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేశ్ వర్మ సంత‌కం చేయ‌డంతో గెజిట్ విడుద‌ల‌య్యింది. తెలంగాణ పంచాయ‌తీ రాజ్ (రెండో స‌వ‌ర‌ణ‌) చ‌ట్టం, 2025 లో సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్త‌ర‌ణ‌, న‌ల్గొండ జిల్లాలోని హాలియా మున్సిపాలిటి ప‌రిధిలోని ఇబ్ర‌హీం పేట ను నూత‌న గ్రామ పంచాయ‌తీగా ఏర్పాటు చేశారు. దీంతో పంచాయతీరాజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

కాగా గ్రామీణ స్థానిక సంస్థ‌ల్లో రిజ‌ర్వేష‌న్ల స‌డ‌లింపున‌కు ఉద్దేశించిన తెలంగాణ పంచాయ‌తీ రాజ్ (రెండో స‌వ‌ర‌ణ‌) చ‌ట్టం,2025 బిల్లు ఇంకా గ‌వ‌ర్న‌ర్ ఆమోదం పొంద‌లేదు. ఈ మేరకు రాజ్‌భవన్ వర్గాలు గురువారం వెల్లడించాయి. రిజర్వేషన్ల సీలింగ్ 50 శాతాన్ని ఎత్తివేస్తూ ఉభయ సభలు ఆమోదించిన బిల్లు ఇంకా గవర్నర్ కార్యాలయంలో పెండింగ్‌లోనే ఉంది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు అడ్డంకిగా మారిన ‘పంచాయతీరాజ్ చట్టం -2018’లోని సెక్షన్ 285 (ఏ)కు, మున్సిపల్ చట్టం- 2019లోని సెక్షన్ 29కు సవరణ చేస్తూ రెండు బిల్లులను ఉభయసభలు ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ కార్యాలయానికి ఆమోదం కోసం పంపించింది. ఈ బిలుల్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాజ్‌భవన్ వెల్లడించింది. అయితే ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదని రాజ్‌భవన్ అధికారులు స్పష్టం చేశారు.

Next Story