ఎల్‌ఆర్‌ఎస్ పేరిట డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు: హరీశ్ రావు
ఎల్‌ఆర్‌ఎస్‌పై త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు స్పందించారు.
By అంజి Published on 8 Jan 2025 6:30 AMఎల్‌ఆర్‌ఎస్ పేరిట డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు: హరీశ్ రావు
హైదరాబాద్: ఎల్‌ఆర్‌ఎస్‌పై త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు స్పందించారు. ఉచితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ పేరిట డబ్బులు దండుకునేందుకు సిద్ధమవడం సిగ్గుచేటని విమర్శించారు. 'రియల్ ఎస్టేట్ త్వరలో పుంజుకుంటుందని స్వయంగా రెవెన్యూ మంత్రే అన్నారు. అంటే రియల్ ఎస్టేట్ కుదేలైందనే కదా అర్థం. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏం చెబుతారు' అని హరీశ్ రావు ప్రశ్నించారు.
''ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్) పేరిట 15 వేల కోట్లు ప్రజల ముక్కు పిండి వసూలు చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం'' అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణికి ఇది మరో నిదర్శనమన్నారు. ఎల్ఆర్ఎస్ పైన నాడు అడ్డగోలుగా విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి రాగానే అసలు రంగు బయటపెట్టిందన్నారు. "డబ్బులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎల్ఆర్ఎస్ పేరిట డబ్బులు దండుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మేము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కోసం రెండు రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రజల నుంచి సొమ్మును దండుకునే కార్యక్రమానికి తెర లేపడం సిగ్గుచేటు'' అని హరీశ్ రావు దుయ్యబట్టారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అస్తవ్యస్త పాలన వలన రియల్ ఎస్టేట్ కుదేలైందని మేము ముందు నుండే చెప్తుంటే బుకాయిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారు? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ''ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దాడులు చేయడం మానేసి అభివృద్ధిపై దృష్టి సారించండి. దారి తప్పిన పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేయండి'' అని హరీశ్ రావు హితవు పలికారు.