వరంగల్ సమగ్రాభివృద్దే ప్రభుత్వ సంకల్పం: మంత్రి పొంగులేటి
చారిత్రాత్మక వరంగల్ నగరాన్ని తెలంగాణ రెండవ రాజధానిగా చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
By అంజి
వరంగల్ సమగ్రాభివృద్దే ప్రభుత్వ సంకల్పం: మంత్రి పొంగులేటి
చారిత్రాత్మక వరంగల్ నగరాన్ని తెలంగాణ రెండవ రాజధానిగా చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. 2057 జనాభాను దృష్టిలో పెట్టుకొని రూ. 4170 కోట్లతో వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్ధ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ నగరాభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో వరంగల్ నగర అభివృద్ధిపై పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు,కార్పోరేషన్ ఛైర్మన్లు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి మంత్రి పొంగులేటి వరంగల్ విమానాశ్రయం, మెగా టెక్స్‌టైల్ పార్క్, భద్రకాళి దేవస్థానం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు, రైల్వే తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. వరంగల్ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం మామునూరు ఎయిర్ పోర్ట్ త్వరలో సాకారం కానుందన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఎయిర్ పోర్ట్‌కు అవసరమైన భూ సేకరణ చేపట్టామన్నారు. ఇందు కోసం 205 కోట్ల రూపాయలు గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ సంబంధించి ఆర్ & ఆర్ ప్యాకేజీ కింద 1398 మంది లబ్దిదారులను గుర్తించి రాజీవ్ గాంధీ టౌన్ షిప్‌లో 863 ప్లాట్‌లు కేటాయించినట్టు తెలిపారు.
సెప్టెంబర్ నెలాఖరు నాటికి టౌన్ షిప్ లో మౌలికసదుపాయాల కల్పన పూర్తి కానుందన్నారు. వెటర్నరీ హాస్పిటల్, ప్రాధమిక పాఠశాల, గ్రామ పంచాయితీ కార్యాలయ భవనాల నిర్మాణం, మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో స్ధానిక యువతకు ఉపాధి, ఉద్యోగాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. భద్రకాళి ఆలయ మాడవీధులతో పాటు కల్యాణ మండపం, పూజారి నివాసం , విద్యుత్ అలంకరణలను వచ్చే దసరా నాటికి పూర్తి చేయనున్నట్టు వివరించారు. వరంగల్ జిల్లాలో క్రికెట్ స్టేడియానికి అవసరమైన భూమి గుర్తించినట్టు తెలిపారు.
అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించే ప్రక్రియను వచ్చేనెల 15వ తేదీ లోగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇసుక, బిల్లుల చెల్లింపులు, లబ్దిదారుల ఎంపికలో సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శ్రావణ మాసం మొదలైన నేపధ్యంలో త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు జరుగుతాయన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఫిర్యాదులు, సందేహాలు, సమస్యల పరిష్కారానికి హైదరాబాద్ హౌసింగ్ కార్యాలయంలో త్వరలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. శాసనసభ్యుల భాగస్వామ్యంతో ప్రతి మండలంలో రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.