పేదలకు గుడ్‌న్యూస్‌.. పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు!

పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పేదలు నివసిస్తున్న చోటే జీ+3 పద్ధతిలో నిర్మాణం చేపట్టేలా యోచన చేస్తోంది.

By అంజి
Published on : 23 July 2025 7:28 AM IST

Government, collectors, construction, Indiramma Houses, Hyderabad

పేదలకు గుడ్‌న్యూస్‌.. పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు!

హైదరాబాద్‌: పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పేదలు నివసిస్తున్న చోటే జీ+3 పద్ధతిలో నిర్మాణం చేపట్టేలా యోచన చేస్తోంది. ఈ మేరకు అవసరమైన స్థలాలను గుర్తించాలని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మరోవైపు అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను పూర్తి చేసి, అర్హులకు కేటాయించాలని సూచించారు.

నిన్న డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో హౌసింగ్ అధికారుల‌తోపాటు జిహెచ్ఎంసీ క‌మీష‌న‌ర్, హైద‌రాబాద్, రంగారెడ్డి, మేడ్చ‌ల్‌ మల్కాజ్‌గిరి , సంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌ల‌తో ప‌ట్ట‌ణాల‌లో ఇందిర‌మ్మ ఇండ్లు, 2 బిహెచ్‌కే ఇండ్ల‌పై మంత్రి పొంగులేటి సుదీర్ఘంగా స‌మీక్ష నిర్వహించారు. ఈసంద‌ర్బంగా హౌసింగ్ కాల‌నీస్ ఇన్స్‌పెక్ష‌న్ యాప్‌ను ప్రారంభించారు.

గ్రామీణ ప్రాంతాల్లో మొద‌టి ద‌శ ఇందిర‌మ్మ ఇండ్ల ప్ర‌క్రియ కొలిక్కి వ‌చ్చిన నేప‌థ్యంలో ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఇందిర‌మ్మ ఇండ్లపై సమీక్షలో చర్చించారు. హైద‌రాబాద్‌కు దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే త‌మ జీవ‌నోపాధికి ఇబ్బంది క‌లుగుతుంద‌న్న ఉద్దేశంతో ఇండ్లు తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని పేద ప్ర‌జ‌లు, వారికి ఇబ్బంది లేకుండా వారు నివ‌సిస్తున్న చోట‌నే జి+3 ప‌ద్ద‌తిలో ఇండ్ల నిర్మాణం చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గ‌త ప్ర‌భుత్వంలో కేటాయించిన ఇళ్ల‌లోకి వెళ్ల‌డానికి పేదలు సుముఖంగా లేరని తెలిపారు.

మురికివాడ‌ల్లో నివ‌సిస్తున్న వారికి అక్కడే జి+3 ప‌ద్ద‌తిలో ఇండ్లు నిర్మించి ఇవ్వ‌డానికి వీలుగా స్ధ‌లాల‌ను గుర్తించాల‌ని అధికారులకు సూచించారు. జి+3 ప‌ద్ద‌తిలో ఎన్నిఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించ‌వ‌చ్చు అనే అంశాల‌పై ఈనెలాఖ‌రులోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను అదేశించారు. ప‌ట్ట‌ణ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌నాభాను దృష్టిలో పెట్టుకొని 3500 కంటే అద‌నంగా ఇండ్లను మంజూరు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

2బిహెచ్‌కె ఇండ్లకు సంబంధించి సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చ‌ల్ మల్కాజ్‌గిరిల్లో కేటాయించిన వాటిలో 30 వేల ఇండ్లు ఖాళీగా ఉన్నాయని, ఇండ్ల కేటాయింపు పొంది అక్క‌డ నివ‌సించ‌ని వారంద‌రికీ నోటీసులు జారీ చేయాల‌ని మంత్రి నిర్ణయించారు. అసంపూర్తిగా ఉన్న 2 బి హెచ్ కే ల‌ను పూర్తిచేసి.. వాట‌ర్‌, క‌రెంట్, డ్రైనేజ్ వంటి క‌నీస వ‌స‌తుల‌ను క‌ల్పించి ఆగ‌స్టు నెలాఖ‌రులోగా కేటాయింపులు పూర్తిచేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు.

Next Story