Telangana: శుభవార్త.. అర్హులైన రైతులందరికీ లక్ష రూపాయల రుణమాఫీ
రైతులందరికీ శుభవార్త. తొలివిడతగా ఈ నెల 18 వ తేదీ నాటికి అర్హులైన రైతులందరికీ లక్ష రూపాయల మేరకు రుణమాఫీ కానుంది.
By అంజి Published on 16 July 2024 6:15 PM ISTTelangana: శుభవార్త.. అర్హులైన రైతులందరికీ లక్ష రూపాయల రుణమాఫీ
రైతులందరికీ శుభవార్త. తొలివిడతగా ఈ నెల 18 వ తేదీ నాటికి అర్హులైన రైతులందరికీ లక్ష రూపాయల మేరకు రుణమాఫీ కానుంది. రుణ మాఫీకి రేషన్ కార్డు నిబంధన పెట్టారన్న అంశంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. పాస్ బుక్ ఆధారంగానే రైతు కుటుంబానికి రూ. 2 లక్షల పంట రుణ మాఫీ వర్తిస్తుందని చెప్పారు.
కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. తొలివిడత రుణ మాఫీ అమలుకాగానే రైతు వేదికల్లో లబ్దిదారులతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సంబంరాలు నిర్వహిస్తారని చెప్పారు.
రుణ మాఫీ నిధులు పక్కదారి పట్టకుండా ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగారు బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రుణ మాఫీ కోసం విడుదలైన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసిన పక్షంలో బ్యాంకర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సచివాలయంలో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సుధీర్ఘంగా జరుగుతున్న సమావేశంలో రుణ మాఫీపై స్పష్టతనివ్వడంతో పాటు సంక్షేమ పథకాలపై సుధీర్ఘంగా వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు చివరి లబ్దిదారుల వరకు చేరవేసే బాధ్యత కలెక్టర్లదేనని గుర్తుచేశారు. జిల్లా కలెక్టర్లు అందరూ క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందేనని ఆదేశించారు.
ఆరు గ్యారంటీలను రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయాలనేది ప్రభుత్వ ధ్యేయమని సీఎం పునరుద్ఘాటించారు. గృహ జ్యోతి, మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ పథకాలకు అర్హులై ఉండీ పథకం వర్తించకపోతే.. తమ ఆధార్, రేషన్ కార్డు, లేదా గ్యాస్ కనెక్షన్ నెంబర్, విద్యుత్తు సర్వీసు నెంబర్లు సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిన విషయాన్ని విడమరిచారు. పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించాలి. ఆగస్టు 15 లోగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలి.
మహిళా స్వయం సహాయక సంఘాల్లో 64 లక్షల మంది సభ్యులుండగా, కోటి మంది సభ్యులుగా చేరేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. ఆర్టీసీలో కొత్తగా అవసరమయ్యే అద్దె బస్సులు కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని చెప్పారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా కాపాడటానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులతో సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చూడటమే కాకుండా ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.