ఆ ప్లాట్‌లు కొన్నవారికి గుడ్‌న్యూస్..25 శాతం రాయితీ కల్పించిన సర్కార్
సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్ఎస్ అమలులో వేగం పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 19 Feb 2025 8:05 PM IST
ఆ ప్లాట్‌లు కొన్నవారికి గుడ్‌న్యూస్..25 శాతం రాయితీ కల్పించిన సర్కార్
సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్ఎస్ అమలులో వేగం పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలు ప్రగతిపై బుధవారం డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఎల్‌ఆర్ఎస్ పథకం అమలులో వేగం పెంచే కార్యక్రమంలో భాగంగా 25 శాతం రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాట్ కొనుగోలుదారులకు ఈ రాయితీ వెసులుబాటును మార్చి 31వ తేదీ వరకు కల్పించింది. దీంతో పాటు వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకోని వారికి.. లే అవుట్‌లో పెద్ద సంఖ్యలో విక్రయం కాకుండా ఉన్న ప్లాట్ల రెగ్యులరైజేషన్‌కు పలు వెసులుబాట్లు కల్పిస్తూ మంత్రులు నిర్ణయం తీసుకున్నారు.
ఒక లే అవుట్‌లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయి ఉండి మిగిలిపోయిన 90 శాతం ప్లాట్లకు ఎల్‌ఆర్ఎస్ పథకంలో క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. వీరికి కూడా మార్చి 31 వరకు 25 శాతం రాయితీ పొందే అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్లు కలిగిన వారికి కూడా మార్చి 31వ తేదీ లోపు ఎల్‌ఆర్‌ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ కల్పించేలా ఛాన్స్ ఇచ్చారు. గత నాలుగు సంవత్సరాలుగా ఎల్‌ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం గురించి పేద ప్రజలు ఎదురుచూస్తున్నారని వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రులు విజ్ఞప్తి చేశారు.