పవన్ కళ్యాణ్ పై గంగుల కమలాకర్ విమర్శలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ కూడా పోటీ చేస్తోంది. బీజేపీతో పొత్తు కూడా ఉంది.
By Medi Samrat Published on 22 Nov 2023 8:00 PM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ కూడా పోటీ చేస్తోంది. బీజేపీతో పొత్తు కూడా ఉంది. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం కోసం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. అయితే పవన్ కళ్యాణ్ పై మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నాడని ప్రశ్నించారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఎందుకు వచ్చాడని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు దొంగలని, ఢిల్లీ గులాములని విమర్శల వర్షం కురిపించారు. తన మీద పోటీ చేస్తున్న బీజేపీ నేత బండి సంజయ్ మూడోసారి ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
పవన్ కళ్యాణ్ వరంగల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణలో అవినీతి రాజ్యం ఏలుతుందన్నారు. తెలంగాణ అంటేనే పొరాటాలకు కేరాఫ్ అని.. తెలంగాణ ప్రజలు కోరుకున్న రోజు పూర్తిస్థాయిలో వస్తానన్నారు. జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. యువత బంగారు భవిష్యత్ కోసం పోరాటం చేస్తానన్నారు. గతంలో తాను ఆదిలాబాద్ లో పర్యటించినప్పుడు నీళ్లు లేని పరిస్థితి చూశానన్నారు. అవినీతి రహిత తెలంగాణను కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.