తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ప్రయాణ సదుపాయాన్ని తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే!! ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటి వరకు ఏడు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. రాజేంద్రనగర్ బస్సు డిపోలో నిర్వహించిన వనభోజన కార్యక్రమానికి సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్టీసీకి ప్రయాణికులు, కార్మికులు రెండు కళ్లలాంటి వారని.. త్వరలో ఆర్టీసీ సిబ్బందికి పీఆర్సీ అందజేస్తామని, ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. తమ సిబ్బంది ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు.
రాష్ట్రంలో ఆర్టీసీ అభ్యున్నతి సాధించడానికి సిబ్బంది కృషి ఎంతో ఉందని కొనియాడారు సజ్జనార్. సంక్రాంతి పండుగకు కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఇబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తార్నాకలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.