మంత్రి కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మాటలతో పబ్భం గడుపుకునే ప్రభుత్వమిదని ఆయన విమర్శించారు. మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 71 లక్షలు ఉద్యోగాలు వస్తాయి అన్నారు.. ఇప్పుడు వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కొత్త కంపెనీలు ఎన్ని వచ్చాయి.. అందులో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఐటీ అంటే ఇవంకా ట్రంప్ అని ఐటీ మంత్రి కామెడీ చేశారని.. కంపెనీ వచ్చింది అని డబ్బా కొట్టుకోవడానికి.. 4 రోజులు 4 ప్రోగ్రాంలు చేస్తే సరిపోదని దుయ్యబట్టారు. నిజాం సాగర్ కళకళలాడుతోందని పబ్లిక్ మీటింగ్ లో చెప్పటానికి సిగ్గు ఉండాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు కాళేశ్వరం నుండి వచ్చే నీటి లింక్ ఇంకా పూర్తి కాలేదని.. అప్పుడే వాటర్ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. రిజర్వాయర్లు అన్ని ఖాళీగా ఉన్నాయి.. నీటితో నింపే పరిస్థితి లేదని పొన్నాల అన్నారు.