HCUలో 3 చెరువులు ఉన్నాయి? హైడ్రా ఎక్కడికి పోయింది?..విధ్వంసం కనిపించడం లేదా?: జగదీశ్ రెడ్డి

విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

By Knakam Karthik
Published on : 2 April 2025 2:33 PM IST

Telangana, Hyderabad News, Former Minister Jagadishreddy, Congress Government

HCUలో 3 చెరువులు ఉన్నాయి? హైడ్రా ఎక్కడికి పోయింది?..విధ్వంసం కనిపించడం లేదా?: జగదీశ్ రెడ్డి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడుకోవాలని ఆందోళన చేస్తోన్న విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నాటి విద్యార్థుల ఉద్యమ ఫలితంగా, హెచ్‌సీయూ ఏర్పాటైంది. నేడు ఆ భూములను కాపాడుకునేందుకు మరోసారి ఉద్యమిస్తున్నారు. విద్యార్థుల ఉద్యమంపై పెయిడ్ బ్యాచ్ అనడం దారుణం. పేమెంట్లు ఇచ్చి పదవులు తెచ్చుకున్నది కాంగ్రెస్ సీఎం, మంత్రులు..అని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. మీరంతా ప్రజా ఉద్యమాలతో వచ్చిన వారు కాదు..అని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ హరితహారం చేస్తే, రేవంత్ హరితసంహారం చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వానిది. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే యూనివర్సిటీలోకి వెళ్లగలరా? కేంద్రమంత్రులు తలచుకుంటే దీన్ని ఆపలేరా? కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న నాటకాలు ఇవి. వీసీ అనుమతి లేకుండా పోలీసులు యూనివర్సిటీలో అడుగుపెట్టకూడదు. పర్యావరణం కాపాడుకునేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తుంటే.. వారిపై దాడులు చేస్తారా? ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీలో వేల ఎకరాలు భూములు ఉండగా.. పచ్చని చెట్లు, జంతువులు ఉన్న స్థలమే కావాలా? దీని వెనుక చీకటి కోణం ఉంది. హెచ్‌సీయూలో మూడు చెరువులు ఉన్నాయి. మరి హైడ్రా ఎక్కడికి పోయింది. రంగనాథ్ ఎక్కడున్నారో? రాహుల్ గాంధీ ఎక్కుడున్నారు? హెచ్‌సీయూ విధ్వంసం మీకు కనిపించడం లేదా?.అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.

Next Story