తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి మంగళవారం తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ నూతన నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ పదవిలో సోమేష్ కుమార్ మూడేళ్లు కొనసాగనున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పదవి ద్వారా ఆయనకు కేబినెట్ హోదా కల్పించారు. ఆయన నియమానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండీషన్స్ విడిగా జారీ చేయబడతాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ప్రభుత్వ సర్వీసు నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన తర్వాత నుంచి సోమేష్ కుమార్ భవిష్యత్ కార్యచరణపై అనేక రకాలు ప్రచారాలు సాగుతున్న సంగతి తెలిసిందే. రెరా చైర్మన్ అవుతారని, బీఆర్ఎస్‌లో చేరి ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల్లో కీలక భూమిక పోషించనున్నారనే ఊహాగానాలు చెలరేగాయి. తాజా ఉత్తర్వులతో ఊహాగానాలకు తెరపడింది.