తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు

తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి అధికారుల‌తో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణ‌యించారు.

By Medi Samrat  Published on  6 July 2024 8:45 PM IST
తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు

తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి అధికారుల‌తో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణ‌యించారు. ఈ క‌మిటీ గత పదేళ్ళలో పరిష్కారం కాని అంశాలపై సుదీర్ఘంగా చర్చించ‌నుంది. ఈ విష‌య‌మై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మంత్రులు అనగాని సత్య ప్రసాద్, జనార్దన్ రెడ్డి, దుర్గేష్.. తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్ ఈరోజు జరిగిన సమావేశం యొక్క నిర్ణయాలను ఉమ్మడిగా తెలియజేయడం కోసమే మీ ముందు కూర్చున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కొద్దిమంది మంత్రులు అయిన మేము లోతుగా చర్చించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలను, సమస్యలను త్వరితగతిన చర్చించుకోవాలని, పరిష్కరించాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది.

ఒక్క సమావేశంలోనే పరిష్కారం వస్తుందని మేము అనుకోలేదు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీఎస్ లతో పాటు ముగ్గురు అధికారులతో కమిటీ ఉంటుంది. రెండు వారాల్లో సమావేశం కావాలని నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ అధికారుల కమిటీలో పరిష్కారం కానీ అంశాల కోసం మంత్రుల కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అక్కడ కూడా వీలుకాకపోతే ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబర్ క్రైమ్ నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈమేరకు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేయాలని నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ఈరోజు తెలుగు జాతి హర్షించే రోజు. విభజన చట్టంలోని సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ పంపించారు. ఈరోజు జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అందరి సలహాలు తీసుకుని కూలంకషంగా చర్చించాం. పెద్ద ఎత్తున ఉద్యమం తర్వాత తెలంగాణ ఏర్పడింది. అందరికీ మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా మళ్లీ సమావేశమై చర్చించాలని ఇద్దరు సీఎంలు చెప్పారు. ఏపీలో ఇప్పటికే డ్రగ్స్ పై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం. డ్రగ్స్ మహమ్మారి సమస్యలను ఇరు రాష్ట్రాల అడిషనల్ డీజీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు.

Next Story