వరంగల్‌లో రూ.414 కోట్ల వరద నష్టం.. త్వరలోనే బాధితులకు సాయం పంపిణీ
వరంగల్ పరిధిలో వరద నష్టంపై ప్రాథమిక అంచనా ప్రకారం రూ.414 కోట్ల మేర నష్టం వాటిల్లిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.
By అంజి Published on 30 July 2023 7:10 AM ISTవరంగల్‌లో రూ.414 కోట్ల వరద నష్టం.. త్వరలోనే బాధితులకు సాయం పంపిణీ
వరంగల్ , హన్మకొండ జిల్లాలు, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వరద నష్టంపై ప్రాథమిక అంచనా ప్రకారం రూ.414 కోట్ల మేర నష్టం వాటిల్లిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. వరంగల్ జిల్లాలో రూ.89 కోట్లు, హన్మకొండ జిల్లాలో రూ.146 కోట్లు, జీడబ్ల్యూఎంసీ పరిధిలో రూ.179 కోట్ల నష్టం వాటిల్లింది. వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు 36 సహాయ కేంద్రాల ద్వారా 4,668 మందికి సహాయం అందించారు. ఇందులో వరంగల్ జిల్లాలో 7, హన్మకొండ జిల్లాలో 4, జిడబ్ల్యుఎంసీ పరిధిలో 25 కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం హన్మకొండలో వరంగల్, హన్మకొండ , జీడబ్ల్యూఎంసీ పరిధిలోని అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో మంత్రి కీలకమైన వివరాలను పంచుకున్నారు. మొత్తం 38 రెస్క్యూ బృందాలు 2,550 మంది వ్యక్తులను విజయవంతంగా రక్షించాయి. వరదల కారణంగా 207 ఇళ్లు పూర్తిగా ధ్వంసమవగా, 480 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వరద బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన మంత్రి, వారి జీవితాలను పునర్నిర్మించడంలో సహాయం చేయడానికి ప్రభుత్వం త్వరలో నష్టపరిహారాన్ని అందజేస్తుందని ధృవీకరించారు. వరదల్లో మృతిచెందినవారికి నాలుగు లక్షల రూపాయల పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు. క్షతగాత్రులకు 60 వేల నుంచి రెండు లక్షల వరకు పరిహారం అందించనున్నట్లు తెలిపారు.
సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ, వరదల పరిస్థితిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని మంత్రి దయాకర్ రావు ప్రతిపక్షాలను కోరారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో వరదలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా మూడోరోజు సమీక్ష నిర్వహించారు. వరదలపై ఎప్పటికప్పుడు నేతలు, అధికారులతో ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో సహాయక చర్యల గురించి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఆరా తీశారు. ముంపు ప్రాంతాల్లో ఇంకా చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.